సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ): ప్రజావాణి కార్యక్రమం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సోమవారం హెడ్ ఆఫీస్‌తో పాటు ఆరు జోన్లలో జరిగింది. పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరించారు. 118 ఫిర్యాదులను స్వీకరించగా, ఇందులో ప్రధాన కార్యాలయంలో 52 విన్నపాలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి 22, ఎఫ్ఏ సెక్షన్ 12, ట్యాక్స్ సెక్షన్ 8, ఇంజనీరింగ్ మూడు, వెటర్నరీ సెక్షన్, శానిటేషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెండు, స్పోర్ట్స్ సెక్షన్‌కు ఒకటి చొప్పున విన్నపాలు అందాయని అధికారులు పేర్కొన్నారు.
ఆరు జోన్లలో 66 ఆర్జీలను స్వీకరించగా, కూకట్పల్లి జోన్లో 36, ఎల్బీనగర్లో 10, సికింద్రాబాద్ జోన్లో 8, శేరి లింగంపల్లిలో రెండు, ఖైరతాబాద్ జోన్లో నాలుగు, చార్మినార్ జోన్లో ఆరు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా రెండు విన్నపాలు స్వీకరించామని, వాటి పరిష్కారానికి ఆయా విభాగాలకు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, నళినీ పద్మావతి, గీతా రాధిక, సత్యనారాయణ, రఘు ప్రసాద్, సుభ్రదా దేవి, సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ సీసీపీ గంగాధర్, జల మండలి జీఎం సాయి రమణ పాల్గొన్నారు.
ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలి
ప్రజావాణి ఫిర్యాదులను నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్లు ముకుంద్ రెడ్డి, కదిరవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 490 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన తెలిపారు. అందులో గృహ నిర్మాణ శాఖకు 419 ఫిర్యాదులు రాగా, 34 పింఛన్లకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు రామకృష్ణ, సాయిరాం, జిల్లా అధికారులు ఆశన్న, కోటజీ, ఇలియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.