Bonalu | చాంద్రాయణగుట్ట, జూలై 7: లాల్‌దర్వాజలో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భిన్న సంస్కృతులకు మేళవింపుగా నిలిచిన పాతనగరంలో తెలంగాణ సంప్రదాయం కలబోతగా వేడుకలను నిర్వహించారు. 115వ వార్షిక బోనాల పండుగ సందర్భంగా తెల్లవారుజామున గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవీ అభిషేకం, అఖండ హారతి పూజలను భక్తుల కోలాహాలం నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్ సోదరుడు సి.శివకుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారి అలంకరణ పూజను నిర్వహించారు. వందలాది మంది భక్తులు తొలిరోజే అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు.
తొలిరోజు పూజలకు సీపీ
తొలిరోజు పూజలకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దక్షిణ మండలం జోనల్ కమిషనర్ వెంకన్న, దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య,ఇన్స్పెక్టర్ భోజ్యా నాయక్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్, కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోనాల బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు బి.మారుతి యాదవ్, పోసాని సదానంద్ ముదిరాజ్, జి.అరవింద్ కుమార్‌గౌడ్, కె.వెంకటేశ్, సి.రాజ్‌కుమార్ యాదవ్, బంగ్లా రాజు యాదవ్, కె.విష్ణుగౌడ్, కాశీనాథ్‌గౌడ్, బద్రీనాథ్‌గౌడ్, సి.వెంకటేశ్, శేషు నారాయణ, పోసాని సురేందర్, వినోద్ కుమార్, చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బోనం సమర్పణ
ప్రతియేట ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించే సాంప్రదాయం న్యాయవాది, ఆలయ మాజీ చైర్మన్ ఎ.మాణిక్ ప్రభుగౌడ్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. ఈ సారి కూడా పూజలు ప్రారంభమైన మొదటి రోజు అమ్మవారికి వేపకొమ్మలతో సాకపెట్టి, భక్తిశ్రద్ధలతో తొలిబోనం సమర్పించారు. ఆలయం వద్ద అన్న ప్రసాదం వితరణ చేశారు.
ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
లాల్‌దర్వాజలో నిజాం కాలం నుంచి వస్తున్నా బోనాల జాతర ఉత్సవాలను యావత్తు తెలంగాణ ప్రజలు తిలకించడానికి వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పండుగను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఆలయం వద్ద తగిన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోట పోలీస్ ఫికెట్తో పాటు నిత్యం పోలీస్ నిఘా ఉంటుంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి.
– సీవీ ఆనంద్, నగర పోలీస్ కమిషనర్