కీసర, ఫిబ్రవరి 10: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడి వద్ద లభించిన బంగారం, నగదునును క్షతగాత్రుని కుటుంబీకులకు అప్పగించి 108 సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు.కీసర మండల కేంద్రంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి ఓ బైక్ అదుపు తప్పి ఓ యువకుడికి గాయాలు అయ్యాయి. క్షత గాత్రుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఈసీఐఎల్‌కు చెందిన వెంకటరాజు (32) ఆదివారం రాత్రి తోటి స్నేహితులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకొని భువనగురి నుంచి ఈసీఐఎల్‌కు తన ద్విచక్ర వాహనం మీద వస్తున్నాడు. రాత్రి పదిన్నర గంటల సమయంలో కీసర ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోకి రాగానే తన బైక్ అదుపు తప్పి కల్వర్ట్‌లో పడిపోయింది. వెంకటరాజు తలకు బలమైన గాయాలు అయ్యి ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని ఆ మార్గం గుండా వెళుతున్న వారు ఈ సమాచారాన్ని 108 కు అందించారు.
ఈ సమాచారం అందకున్న 108 సిబ్బంది చిత్రం రవి, పైలట్ ఆంజనేయులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర రక్తస్రావంతో ఆపస్మారక స్థితిలో ఉన్న అతని అంబులెన్స్‌లోకి తీసుకొని వెంటనే రక్తస్రావాన్ని ఆరికట్టి ఆక్సిజన్‌ను అందిస్తూ అతని ప్రాణాన్ని కాపాడారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి నగరంలోని గాంధీ దవాఖానకు తరలించారు. కాగా అతని వద్ద లభించిన బంగారం గొలుసు, బంగారపు ఉంగరం, మోబైల్ఫోన్, నగదు రూ.1850 రూపాయలను భద్రపరిచి క్షతగాత్రుని కుమారుడు ధనుంజయ్‌కు అప్పగించారు. 108 సిబ్బంది రవిని వారి కుటుంబ సభ్యులు గాంధీ దవాఖాన వైద్యులు అభినందించారు.