సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నిర్మాణ పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే కోకాపేట, దుర్గం చెరువు వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. 29 ఎస్టీపీల్లో 10 ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో మూడు చోట్ల ట్రయల్ రన్ పనులు జరుగుతున్నాయి. కాగా మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనులను వచ్చే రెండు నెలల్లోగా పూర్తి చేయాలన్న నిర్దేశిత లక్ష్యంతో పనులను వేగిరం చేశారు.
ఈ మేరకు అంబర్‌పేట (212.50 ఎంఎల్డీలు), నల్లచెరువు (86.50ఎంఎల్డీ), పెద్ద చెరువు (17.5 ఎంఎల్డీలు), సఫిల్‌గూడ (5.50ఎంఎల్డీలు), మిరాలం (41.50 ఎంఎల్డీలు), నాగోల్ (320 ఎంఎల్డీలు), ఫతేనగర్ (133 ఎంఎల్డీలు), ఖాజాకుంట (20 ఎంఎల్డీలు), వెన్నెలగడ్డ (10 ఎంఎల్డీలు), మియాపూర్ పటేల్ చెరువు (7 ఎంఎల్డీలు) ఎస్టీపీ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండు షిఫ్టుల్లో పని చేస్తూ పనులు వేగంగా జరుపుతున్నారు. రాత్రివేళల్లో పనులు చేయడానికి వీలుగా లైటింగ్ ఏర్పాటు చేశారు. సివిల్ పనులు పూర్తయిన ఎస్టీపీల్లో ఎలక్ట్రో మెకానిక్ సామగ్రి బిగింపు పనులు చేపడుతున్నారు. వీటితో పాటు సుందరీకరణకు గార్డెనింగ్, ల్యాండ్‌స్కేప్ పనులు ముమ్మరం చేశారు.