సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్లో అభయహస్తం దరఖాస్తు ఎంట్రీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. 635 డేటా సెంటర్లతో 3500 మందితో కట్టుదిట్టమైన పర్యవేక్షణ నడుమ దరఖాస్తుల వివరాలను కంప్యూటీకరణ జరుపుతున్నారు. గ్రేటర్లో మొత్తం 24 లక్షల 74 వేల 325 దరఖాస్తులు స్వీకరించగా, అందులో అభయహస్తం అప్లికేషన్లు 19 లక్షలకుపైగా ఉన్నాయి. మిగతా 5.73 లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డు, ఇతర సమస్యలపై వచ్చాయి. ఐదు రోజుల వ్యవధిలో 10 లక్షల అప్లికేషన్స్ డేటా ఎంట్రీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే మూడు లక్షల డేటా ఎంట్రీ చేసినట్లు పేర్కొన్నారు.