హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జీఎచ్ఎంసీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం 10 బస్స్టాండ్లను ఆర్టీసీ సంస్థ ఎంపిక చేసింది. ఇప్పటికే ఉన్న చార్జింగ్ స్టేషన్లతో కలిపి మొత్తం 19 బస్టాండ్లను ఎలక్ట్రిక్ బస్‌ల కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఉన్న బస్టాండ్లను ఎలక్ట్రిక్ వాహనాల కోసం మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ల ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో పనులు త్వరత్వరగా చేపడుతున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు.
దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి ఈ-డ్రైవ్’ పథకాన్ని తీసుకురాగా.. ప్రధాన నగరాల్లో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నది. ఈ క్రమంలో టీజీఎస్ఆర్టీసీ 2,800 బస్సులు కావాలని కేంద్రాన్ని కోరింది. ఆ కోటాలో ఇప్పటికే 300 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా.. మిగిలిన అన్ని బస్సులను కేంద్రం సమకూర్చనుంది. దీంతో అతి త్వరలోనే తెలంగాణలో మొత్తం 2,800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 10 బస్టాండ్లను అందుకు తగ్గట్లుగా మార్చుతున్నారు. ఎక్కడికక్కడే చార్జింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్రం తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్‌లతో తెలంగాణలోని సుమారు 10వేల మందికిపైగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారెజీల సిబ్బందిపై పలు రకాలుగా వేటు పడుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ అమ్మలా ఆదరించిన ఆర్టీసీని వదిలి.. మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన దారుణమైన దుస్థితిని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కోబోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా క్రమ క్రమంగా ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్‌పరం కానుందని అంటున్నారు.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) విధానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమవుతోంది. మొదటి దశలో వివిధ రాష్ర్టాలకు వచ్చే 14,028 ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ మొత్తంతో వాటిని కొనుగోలు చేస్తున్న ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థకు వెళుతుంది. ఇందులో ఆర్టీసీకి ఎలాంటి లాభం ఉండదు. ఇక తెలంగాణకు వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహణ అంతా వాటిని కొనుగోలు చేసిన ఆ కార్పొరేట్ సంస్థనే చూసుకుంటుంది.
వారు నియమించిన వారే డ్రైవర్లు, కండక్టర్లుగా ఉంటారని కార్మిక నేతలు అంటున్నారు. ఇక రిపేర్లకు కూడా ఆ సంస్థ నియమించుకునే వారే ఉంటారు. దీంతో ఆర్టీసీ గ్యారెజీలు ప్రశ్నార్థకం కానున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. చార్జింగ్ స్టేషన్లు ఆర్టీసీ సంస్థవైతే.. వాటి ద్వారా చార్జింగ్ పెట్టుకుని లాభాలు పొందేది ప్రైవేట్ సంస్థలా? అని నిలదీస్తున్నారు.