సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆ అధికారి ఆ ఆలయానికి వచ్చి నెలన్నర కూడా కాలేదు. అంతేకాదు.. ఆయన బాధ్యతలు ముగిసి ఇరవై రోజులు దాటింది. అయినా తన సామాజికవర్గానికి చెందిన మంత్రిగారి అండదండలతో ఇంకా సీటును వదలకుండా కూర్చున్న ఆ దేవాదాయ అధికారి అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ఆ శాఖలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నగరంలో పేరు మోసిన అమ్మవారి ఆలయంలో బోనాలు, కల్యాణం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఉత్సవాలు ఆ అధికారికి ఆదాయ వనరుగా మారాయని దేవాదాయశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దేవాలయానికి ఈ ఏడాది రూ.15 కోట్ల ఆదాయం వచ్చింది. ఏయేటికాయేడు వివిధ రూపాల్లో ఆలయ ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ నిర్వహణకు సంబంధించి తనకు అర్హత లేకున్నా తన బంధువుగా చెప్పుకునే మంత్రి అండదండలతో వచ్చిన ఆ అధికారి.. తన జేబు నింపుకోవడానికి ఆలయ నిధులపై కన్నేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయంలో సేవింగ్స్‌లో ఉన్న రూ.7 కోట్లపై ఆ అధికారి కన్ను పడిందని, ఏదో ఒక రూపంలో ఈ డబ్బుల్లో కొంత మొత్తాన్ని కొట్టేయాలని చూస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
జూలై 7 వరకే తనకు ఇన్చార్జి బాధ్యతలు ఉండగా ఆ తర్వాత కూడా అదే చైర్లో కూర్చుని సుమారు రూ.25 లక్షల చెక్కులపై అనధికారికంగా సంతకాలు పెట్టి వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చి తన వంతు సొమ్ము కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మరో కోటిన్నరకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వడానికి సిద్ధమైన నేపథ్యంలో ఆడిట్ ప్రాబ్లమ్ వస్తే అందరూ ఇరికిపోతారని సన్నిహితుల సలహాతో ఆ చెక్ ఇవ్వడంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతి కోరుతూ లేఖ రాశారు.
ఈ లేఖ రాయడానికి కూడా సదరు కాంట్రాక్టర్‌తో ముందస్తు ఒప్పందాలు కుదిరిన తర్వాతే ఆ పనిచేసినట్లు ఎండోమెంట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తనకు చెక్‌పవర్ లేకున్నా ఆలయ నిధులను ఇష్టారాజ్యంగా వాడడంపై ఉన్నతాధికారుల వరకు సమాచారం ఉందని, అయినా ఆలయ నిధులపై కన్నేసిన ఆ అధికారి బాగోతంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదెందుకంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ నిధులతో పాటు విరాళాలలోనూ స్థానిక ఉద్యోగులతో కలిసి తన చేతివాటం కనబరిచారని, వేరే శాఖలో పనిచేస్తున్న తన రక్తసంబంధీకుడు, ప్రస్తుత శాఖామంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ప్రధాన ఉద్యోగి సహోద్యోగులుగా గతంలో పనిచేసిన సంబంధాలతో ఆలయ అధికారి నిధులను కొల్లగొట్టే
ప్రయత్నం చేస్తున్నారని, తనను ఎవరూ అడ్డుకోలేరంటూ సన్నిహిత వర్గాల దగ్గర అంటున్నారని ఆలయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ప్రసాద్ పథకం కింద ఆ ఆలయానికి రూ.4.21 కోట్ల నిధులు వచ్చి మూలుగుతున్నాయి. కానీ వాటిని వినియోగించడంపై దృష్టి పెట్టకుండా అందుకు సంబంధించిన భవనాన్ని కూల్చివేసే విషయంలో ఆ ఆలయ అధికారి మరోసారి తన బుద్ధి చూపెట్టుకున్నారని దేవాదాయ శాఖలో చర్చ జరుగుతోంది. కూల్చివేతల తర్వాత ఆ ఇనుము ఎవరు తీసుకోవాలి..నువ్వు తీసుకుంటే మాకేంటి.. మేము తీసుకుంటే నీకేంటి.. అంటూ బేరమాడడంతో తప్పని పరిస్థితుల్లో సదరు కాంట్రాక్టర్ తలపట్టుకుని చివరకు ఒక రేట్ చెప్పారని, ఆ భవనం కూల్చివేసి ఇనుము తీసుకుపోతే రూ. 50వేలు ఇవ్వాలని, ఒకవేళ కూల్చివేతలకే అయితే రూ.2 లక్షలు ఇవ్వాలంటూ ప్రతిపాదన పెట్టినట్లుగా ఎండోమెంట్ వర్గాలు చెప్పాయి.
తన చరిత్రలో ఇంత పెద్ద దేవాలయంలో పనిచేసిన అనుభవం లేకపోవడంతో పాటు తాను చేసిన దేవాలయాల్లో చిన్న మొత్తాల్లోనే వసూళ్లు చేసే అలవాటు ఉండడంతో ఈ కూల్చివేతల్లో కూడా ఇనుముపై కాంట్రాక్టర్‌తో మాట్లాడుకున్నట్లుగా ఆ శాఖలో వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారులకు చేరడంతో కాంట్రాక్టర్ ప్రతిపాదనపై ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ లేఖ ఎలా వచ్చినా తన వాటా మాత్రం ఇవ్వాల్సిందేనంటూ కాంట్రాక్టర్‌తో సదరు అధికారి ఒప్పందం కుదుర్చుకున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.