దేశ రాజధాని హస్తినలో పచ్చదనం కుంటుపడి కాలుష్యం పెరిగిపోవడంతో.. జనజీవనం ఊపిరాడటంలేదు. హైదరాబాద్ మహా నగరం మాత్రం రెట్టించిన పచ్చదనంతో కళకళలాడుతున్నది. మొన్నటివరకు కాంక్రీట్ జంగిల్‌గా ఉన్న నగరానికి హరితహారం తొడిగిన తెలంగాణ ప్రభుత్వం.. భావితరాలకు పచ్చలహారాన్ని అందిస్తున్నది. దశాబ్దం కిందట 355 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న నగర ఓపెన్ ఫారెస్ట్ ఇప్పుడు 673 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో పచ్చదనం కుచించుకుపోగా.. అందుకు భిన్నంగా హైదరాబాద్‌లో మాత్రం నగర వైశాల్యంలో ఏకంగా 18 శాతానికి గ్రీనరీ పరుచుకున్నదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక ఏజెన్సీతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించి తాజాగా ఒక నివేదికను కూడా రూపొందించారు. గత ఎనిమిది సంవత్సరాల్లో ఏకంగా ఆరున్నర కోట్ల మొక్కలను నాటడం, పంపిణీ చేసిన క్రమంలో నగరంలోని ప్రతి కాలనీ మొదలు పార్కులు ఇలా అన్ని ప్రాంతాల్లో పచ్చదనం ఏయే స్థాయిలో ఉందనేది సమగ్రంగా నివేదికలో పొందుపరిచారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హరితహారం అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో మూడున్నర లక్షల మొక్కలను జీహెచ్ఎంసీ స్వయంగా నాటింది. ఫ్లై ఓవర్ల కింద, పార్కులు, కాలనీలు ఇలా అనేక ప్రాంతాల్లో నాటారు. వాటికి జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 85 శాతానికి పైగా మొక్కలు (సర్వైవల్) బతికాయని అధికారుల సర్వేలో తేలింది. వీటికి సంబంధించి అధికారిక రికార్డులు కూడా ఉన్నాయి. కాగా సుమారు 2.90 కోట్ల మొక్కలను అధికారులు కాలనీ సంఘాలు, ప్రజలు ఇతర అనేక ప్రాంతాల్లో పంపిణీ చేశారు. తాజాగా ఈ ఏడాదిలోనూ ఇప్పటికే 66 లక్షల మొక్కలను హరితహారం కింద నాటినట్లు అధికారులు తెలిపారు.
44.81 చదరపు కిలోమీటర్లు పెరిగిన అటవీ ప్రాంతం
జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు కాగా.. తెలంగాణ ఏర్పడేనాటికి ఇందులో కేవలం 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండేది. కానీ గత ఎనిమిదేండ్లలో హరితహారంలో భాగంగా గణనీయంగా మొక్కలు నాటడంతో ఇప్పుడు విస్తీర్ణం ఏకంగా 81.81 చదరపు కిలోమీటర్లకు చేరడమంటే అదనంగా 44.81 చదరపు కిలోమీటర్లలో హరితహారం ఫలితాలొచ్చాయని స్పష్టమవుతున్నది. తద్వారా నగర విస్తీర్ణంలో దాదాపు 12-13 శాతం అటవీ ప్రాంతం నమోదైంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దశాబ్ద కాలంలో ఏకంగా 143 శాతం అటవీ ప్రాంతం పెరిగినట్లు తెలిపారు. అయితే దేశంలో ముంబైలో స్వల్ప పెరుగుదల నమోదు కాగా… బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై ఇలా అన్ని మెట్రో నగరాల్లోనూ అటవీ ప్రాంతం తగ్గిపోయింది.
త్వరలోనే సమగ్ర నివేదిక
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) నివేదికనే కాకుండా అసలు గ్రేటర్ పరిధిలో పచ్చదనం ఎలా పరుచుకున్నదనే దానిపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఒక సంస్థతో అధ్యయనం చేయించింది. వాస్తవంగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం అనేది హెక్టారు (రెండున్నర ఎకరాలు) ప్రాతిపదికన ఉంటుంది. అంటే హెక్టారు పరిధిలో చెట్లు ఉంటేనే దానిని అటవీ ప్రాంతంగా పరిగణిస్తారు. అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉంటే దానిని పరిగణలోకి తీసుకోరు. కానీ హరితహారంలో భాగంగా కాలనీలు, రోడ్ల మధ్యలో (సెంట్రల్ మీడియం), రోడ్డుకు ఇరువైపులా, హెక్టారుకు తక్కువ విస్తీర్ణంలో కోట్ల మొక్కలు నాటారు. ఇవన్నీ ఎఫ్ఎస్ఐ అధ్యయన పరిధిలోకి రాలేదు. అందుకే జీహెచ్ఎంసీ అధికారులు చేయించిన అధ్యయనంలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరో 5, 6 శాతం తోడై.. నగర విస్తీర్ణంలో పచ్చదనం అనేది 18-19 శాతం వరకు ఉంటుందని అర్బన్ బయో డైవర్సిటీ డీఎఫ్ఓ వి.కృష్ణ తెలిపారు.
25 శాతం గ్రీనరీ ఉంటేనే.. భవన నిర్మాణ అనుమతులు
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్న సమయంలోనే 25 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా లేఅవుట్లకు అనుమతిచ్చిన తర్వాత నిర్ణీత స్థలంలో గ్రీన్ జోన్‌ను అభివృద్ధి చేస్తే ఆయా లేఅవుట్లకు తుది అనుమతులను ఇస్తున్నామని తెలిపారు. కొత్తగా రోడ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో సైతం గ్రీన్ బఫర్ జోన్లు ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంచుతున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని చెరువులు, ఇతర ప్రాంతాల్లో చెట్లను నాటి, వాటిని సంరక్షించేలా చేస్తున్నామని చెప్పారు. డ్రోన్స్ ద్వారా సైతం విత్తనాలను నాటుతున్నామని, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి నాటిన చెట్లకు నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు.
గ్రీన్ సిటీ హైదరాబాద్: ఆర్వింద్‌కుమార్
పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా హరితహారం కార్యక్రమం చేపడుతున్నదని రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ ఆర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో గ్రీన్ సిటీపై ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐపీహెచ్ గ్రీన్ సిటీ కమిటీ ప్రతినిధి బిల్ హార్డీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్వింద్‌కుమార్ పచ్చదనం పెంపొందించడంపై తీసుకున్న కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా 3 అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించి ఆయా ప్రాజెక్టుల్లో ఏవిధంగా కోట్లాది మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించామన్న వివరాలను వెల్లడించారు. లేక్స్ ఆఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్ నగరంలోనే వివిధ కార్యక్రమాలను చేపట్టామని, చెరువుల అభివృద్ధిలో భాగంగా 150 చెరువులను సుందరీకరణ చేశామని, ఇందులో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి పచ్చదనాన్ని పెంచామన్నారు. ప్రతియేట వర్షాకాలం ప్రారంభ సీజన్లో నాటుతున్న మొక్కల్లో 90 శాతం మొక్కలు పెరిగి పచ్చదనంతో ఉండేలా చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 16 అటవీ ప్రాంతాలు 100 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు ఉండగా, వాటిని సైతం అభివృద్ధి చేసి అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.