గోడలకు చెవులుంటాయ్.. జాగ్రత్త అనేది పాతమాట. ఇప్పుడు ఇండ్లకు కండ్లు కూడా ఉన్నాయ్.. మరీ జాగ్రత్త అని చెప్పాలి. అదేంటి అని ఆశ్చర్యపోకండి.. ఇది నిజమేనండీ.. అవి నిఘా నేత్రాలు. మరో మాటలో చెప్పాలంటే సీసీ కెమెరాలు. ప్రతీక్షణం పహారా కాస్తూ దొంగలను పట్టిస్తున్నాయి. గతంలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు, అపార్ట్మెంట్లు, హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, బంగారు వర్తక కేంద్రాలకే సీసీ కెమెరాలు పరిమితమయ్యేవి. విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరంలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాల వల్ల సీసీ కెమెరాల వినియోగం పెరిగింది. సీసీ కెమెరాల వినియోగంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 15,24,392 ఇండ్లు ఉన్నాయి. కొత్తగా సర్వేలో భాగంగా సర్కిళ్ల పరిధిలో మరో 6,96,734 నూతనంగా నిర్మించిన ఇండ్లను కలిపితే జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 22,21,126 నివాసాలు ఉన్నాయి. దీంట్లో 53 శాతం నివాసాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సుమారు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు వచ్చేది. కెమెరాల సైజు చిన్నగా మారడంతో ప్రస్తుతం ఒక ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుకు సుమారు రూ. 20,000 నుంచి రూ. 30,000 ఖర్చు అవుతుంది.
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన కాలనీల్లో నివసించేవారంతా తప్పనిసరిగా ఇంట, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటికి ఎవరు వచ్చినా వెంటనే తలుపు తీయడం లేదు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న టీవీ ద్వారా బయట ఉన్న వారిని గుర్తించినా తరువాతే తలుపు తీస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే ఇరుగు పొరుగు వారికి, పోలీస్స్టేషన్లకు సమాచారాన్ని అందజేసి అప్రమత్తం అవుతున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లినా, ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారో, ఈ కెమెరాల ద్వారా రికార్డు అయిన టేపులను మళ్లీ ప్లే చేసి చూసుకునే అవకాశం ఉంది. మొబైల్ యాప్‌ల ద్వారా ఎక్కడున్నా ఇంటిపై కన్నువేయవచ్చు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, వ్యాపారులు తమ ఇండ్లలో భద్రత కోసం వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు.
సీసీ కెమెరాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ పది రకాలే ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. బుల్లెట్ టైప్, ఐఆర్, డోమ్, డిస్క్రీట్, ఇన్ఫ్రారెడ్, డే, నైట్ టైప్స్, వెరిఫోకల్, నెట్వర్క్, వైర్లెస్, పీటీజెడ్, హెచ్డీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలకు నిరంతర విద్యుత్ సరాఫరాతో సంబంధం లేదు. ప్రస్తుతం అధికశాతం పోర్టబుల్ చార్జర్‌తోనే పని చేస్తున్నాయి. ఒక్కసారి చార్జి చేస్తే వారం నుంచి పక్షం రోజుల వరకు పని చేస్తాయి. వీటిలో ప్రధానంగా 30 జీబీ నుంచి 300 జీబీ, 500 జీబీ, 1000 జీబీ వరకు డాటాను రికార్డు చేసుకోవచ్చు. ఆయా సామర్థ్యాన్ని బట్టి సీసీ కెమెరాల ధరలు ఉంటాయి.
ప్రత్యేకత : కెమెరా మొత్తం మెటల్
బాడీతో ఉంటుంది. ఉదయం, రాత్రి
సమయాల్లో రికార్డు చేస్తుంది.
నిఘా పరిధి : 10 మీటర్లు
ధర : రూ.2,475 నుంచి ఆపై..
ప్రత్యేకత : కెమెరా మొత్తం మెటల్ బాడీతో ఉండడమే కాకుండా 48ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. రాత్రి వేళల్లోనూ వీడియో క్లారిటీగా వస్తుంది.
నిఘా పరిధి : 30 మీటర్లు
ధర : రూ.3 వేల నుంచి ఆపై..
ప్రత్యేకత : వైర్లెస్ పవర్‌పుల్ బుల్లెట్ కెమెరా.. ఉదయం, రాత్రి సమయాలతోపాటు
జీరో లైట్‌లోనూ రికార్డు చేస్తుంది.
నిఘా పరిధి : 20 మీ. నుంచి
25 మీటర్లు
ధర : రూ.2,500
నుంచి ప్రారంభం
దీన్ని స్కానర్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఇండోర్, అవుట్డోర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. కెమెరాను 360 డిగ్రీల కోణంలో తిప్పుతూ చుట్టూ రికార్డ్ చేయడం దీని ప్రత్యేకత. ధర రూ.645 నుంచి రూ.5,250 వరకు ఉంది.
ఒక వస్తువును లేదా వ్యక్తిని జూమింగ్(దగ్గరగా) చేసి చూసే అవకాశం ఉంది. ఇవి రూ.4 వేల వరకు ధర పలుకుతున్నాయి. జూమింగ్ చేయాలంటే మనం దగ్గరుండి ఆపరేట్ చేయాలి. వీటిని ఎక్కువగా బంగారు దుకాణాల్లో ఉపయోగిస్తారు.
కెమెరాల వినియోగంలో డీవీఆర్ (డిజిటల్ వీడియో రికార్డింగ్)ను అనుసంధానం చేస్తారు. అంటే కెమెరాలు తీసిన ప్రతి చిత్రం డీవీఆర్ రికార్డ్ అయి టీవీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డీవీఆర్ హార్డ్‌డిస్క్ కెపాసిటీ 500ఎంబీ వేస్తే 15 రోజులు, 1 జీబీ వేస్తే 30 రోజులపాటు రికార్డు అయిన చిత్రాలు భద్రంగా ఉంటాయి. ఈ డీవీఆర్లు (ఫోర్ కెమెరాల సెట్) ప్రస్తుత మార్కెట్లో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు లభిస్తున్నాయి.
ప్రత్యేకత : సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా వీడియో డోర్ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో ఇంటి తలుపు ముందుకు ఎవరు వచ్చారో తెలుసుకోవచ్చు. వారితో మాట్లాడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో లేని సమయాల్లో ఎవరు డోర్ కొట్టినా వారి చిత్రాలను నిక్షిప్తం చేస్తుంది.
ధర : రూ. 6,255 నుంచి ఆపై…
ప్రత్యేకత : ఉదయం కలర్, రాత్రి సమయాల్లో బ్లాక్ అండ్ వైట్‌లో రికార్డు చేస్తుంది. చీకట్లోనూ చిత్రాలను తీయడం మరో విశేషం.
నిఘా పరిధి : 5 నుంచి 10 మీటర్లు
ధర : రూ.1500 నుంచి ఆపై..
రూటర్ : ఇంట్లో అమర్చిన కెమెరాల కనెక్షన్లను డీవీఆర్కు అనుసంధానానికి ‘రూటర్’ ను ఉపయోగిస్తారు. ఇది డీవీఆర్ నుంచి సెల్‌ఫోన్‌కు ఇంటర్నెట్ షేరింగ్ చేస్తుంది. ధర దాదాపు రూ.7 వేలు.