మేడ్చల్, మే 18 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గురువారం జిల్లాలోని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లతో టీఎస్-బీపాస్పై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. టీఎస్-బీపాస్పై గ్రామాల్లో అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
ఇండ్లు లేని నిరుపేదలందరికీ గృహాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. 60 గజాల స్థలం మొదలుకుని 120 గజాల స్థలాల్లో ఇండ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలో 3 వేల మందికి గృహలక్ష్మి పథకం అందించేలా అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 5వేల 5 వందల మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగ్యస్త, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.