సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విభజన నిర్ణయం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఏదో ఒక రూపంలో పౌరులకు సరికొత్త పరిపాలనా సమస్యలు వెంటాడుతూనే ఉన్నారు. కొత్త కార్పొరేషన్ల పరిధిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సామాన్య కొనుగోలుదారులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఆస్తుల ‘మ్యుటేషన్ (యాజమాన్య హకుల మార్పిడి) కాకపోవడంతో కొనుగోలుదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమస్య జఠిలమవుతున్నా.. పరిషరించడంలో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయా విభాగాల మధ్య సాంకేతిక మార్పులు, డేటా బదలాయింపు, రికార్డుల క్రోడీకరణ ప్రక్రియకు తోడుగా రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్, మున్సిపల్ సాఫ్ట్వేర్ల మధ్య సమన్వయం లోపించి మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. తద్వారా కొన్ని నెలల తరబడి సాంకేతిక సమస్యల కారణంగా కొత్తగా ఏర్పడిన సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లలో దాదాపు 1000కి పైగా మ్యుటేషన్లకు సంబంధించి వేల దరఖాస్తులు పెండింగ్లో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూముల విలువ పెంపు నేపథ్యంలో గడిచిన రెండు రోజులుగా ట్రై కార్పొరేషన్ల పరిధిలో మొత్తంలో మ్యుటేషన్లు నిలిపివేయడం గమనార్హం.
రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి ఫీజులు, సేవా రుసుములు ముకుపిండి వసూలు చేసిన అధికారులు.. పని పూర్తి చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధితులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం దకడం లేదని, అధికారులను నిలదీస్తే ‘సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.. పై నుంచి ఆదేశాలు రావాలి’ అంటూ కాలయాపన చేస్తుండటంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియ నిలిచిపోవడం వల్ల నగరవాసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని, ప్రభుత్వ రికార్డుల్లో పేరు మారకపోవడంతో అత్యవసరాల కోసం బ్యాంకు రుణాలు పొందేందుకు వీలు పడటం లేదని పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు. అలాగే కొనుగోలు చేసిన ఆస్తులను తిరిగి అమ్ముకుందామన్నా లీగల్ సమస్యలు వస్తుండటంతో క్రయవిక్రయాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిషరించి, ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.