ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 8: 47 ఏండ్ల తర్వాత నిండి అలుగు పారుతున్న ఇబ్రహీంపట్నం పెద్దచెరువును చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయమే ఉప్పరిగూడ, పోచారం, శేరిగూడ, ఇబ్రహీంపట్నం, మంగల్‌పల్లి, కర్ణంగూడ గ్రామస్తులు అధిక సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. సెల్ఫీలతో సందడి చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పెద్ద చెరువు తూము వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇబ్రహీంపట్నం చిన్నచెరువు కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో చిన్నచెరువులో నిర్మించిన అనేక ఇండ్లు నీట మునిగాయి. నీట మునిగిన ఇండ్లను ఖాళీచేసి ప్రజలు ఇతర ప్రాం తాలకు తరలివెళ్లారు. బాధితుల కోసం అధికారులు రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటితో చిన్నచెరువులోనూ నీటి ప్రవాహం పెరుగుతుండటంతో చెరువు సమీపంలోని పలు కాలనీలు నీటమునిగాయి.
జంట జలాశయాలకు జలకళ
గ్రేటర్ హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి వరద నీరు పోటెత్తుతున్నది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరివాహక ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో ఇన్‌ఫ్లో పెరుగుతూనే ఉంది. దీంతో జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా మరో మూడురోజులు భారీ వర్షాలున్న నేపథ్యంలో మూసీనది పరీవాహక ప్రాంతాల నివాసితులను అధికారులు అప్రమత్తం చేశారు.