మాదాపూర్, జూలై 17: పైసా పైసా కూడా బెట్టి కష్టార్జితంతో స్థలాన్ని కొనుగోలు చేశాం.. మేము కబ్జాదారులం కాదు.. ప్రభుత్వమే మమ్ములను కాపాడాలంటూ సున్నం చెరువు బాధితులు నల్ల రిబ్బన్లను కండ్లకు గంతలుగా కట్టుకొని నిరసన ప్రదర్శన చేశారు. మాదాపూర్ లోని సియేట్ మారుతి హిల్స్ సొసైటీ కాలనీ సభ్యులు సున్నం చెరువు వద్ద హైడ్రా తప్పుడు సర్వే చేసిందని గురువారం నిరసన ప్రదర్శన చేశారు. అన్ని రకాల అనుమతులతో ఇండ్లను నిర్మించుకున్నామని, పైసా పైసా కూడా బెట్టి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ప్లాట్లను కొనుగోలు చేశామని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
హైడ్రా అధికారులు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని తమను ఇక్కడ నుంచి ఖాళీ చేయించారని వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ బస్తీలకు ఓసారి వచ్చి తమ పరిస్థితులను చూడాలని, ‘మీరే మాకు సహాయం చేయాలి’ అని వేడుకున్నారు. రెండు ఎకరాల స్థలాన్ని పార్క్ కోసం వదిలేశాకే హెచ్ఎండీఏ లే అవుట్ అప్రూవల్ అయిందని దాని ప్రకారం.. అన్ని సరిగా ఉన్నాయన్నది చూశాకే 25 ఏండ్ల కిందట ప్లాట్లను కొనుగోలు చేసినట్లు చెప్పారు.
అన్ని అనుమతులతోనే ముందుకు వెళ్లామని బాధితులు చెబుతున్నారు. యూఎల్సీ, ఎల్ఆర్ఎస్, ప్రాపర్టీ టాక్స్ అన్ని ఉన్నాయని, కరెంట్, నీళ్ల బిల్లులు అన్ని సక్రమంగా కడుతున్నట్లు చెప్పారు. అల్లాపూర్ డివిజన్ సర్వే నంబర్ 30లో ఉన్న 24.12 ఎకరాలు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం చేయలేదని, కోర్టు డైరెక్షన్ ప్రకారం చేసినట్లయితే తమకు న్యాయం జరుగుతుందని బాధితులు వాపోయారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి, సెయేట్ కాలనీని పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.