సుల్తాన్‌బజార్, నవంబర్ 14: వ్యాధిని గుర్తించి వ్యాయామ, ఆహారపు అలవాట్లతో మధుమేహాన్ని (డయాబెటిస్) పూర్తిగా కట్టడి చేసుకోచ్చని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. సోమవారం వరల్డ్ డయాబెటిస్ డే పురస్కరించుకొని ఉస్మానియా దవాఖానలోని ఎండోక్రైనాలజీ విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా పాత భవనం నుంచి ఓపీ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఇన్సులిన్ తీసుకునే డయాబెటిస్ రోగుల కోసం టైప్-1 డయాబెటిస్ క్లినిక్ ను, హిమోఫీలియా సెంటర్లను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, ఎండోక్రైనాలజీ విభాగం ప్రొఫెసర్లు డాక్టర్ రాకేశ్ సహాయ్, డాక్టర్ నీలవేణితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, ఆర్ఎంవోలు డాక్టర్ శేషాద్రి, డాక్టర్ సాయిశోభ, డాక్టర్ ఎండి రఫీ, డాక్టర్ సుష్మా, డాక్టర్ మాధవి, డాక్టర్ రాకేశ్ సహాయ్, డాక్టర్ నీలవేణి, డాక్టర్ మనీషా సహాయ్ తదితరులు పాల్గొన్నారు.
కింగ్‌కోఠి జిల్లా దవాఖానలో..
తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్ కోఠి జిల్లా దవాఖానను సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి సందర్శించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్‌తో కలిసి డయాబెటిక్ రెటినోథెరపీ క్లినిక్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డయాబెటిస్ రోగులలో కంటి చూపు మందగిస్తుందని తెలిపారు. ఈ క్లినిక్ ప్రారంభంతో డయాబెటిస్ రోగులకు ఐ స్క్రీనింగ్ నిర్వహిస్తారని చెప్పారు.