సిటీబ్యూరో: చారిత్రక కట్టడమైన పైగా ప్యాలెస్ విషయంలో హెచ్ఎండీఏ వ్యవహారం వారసత్వ సంపదకే నష్టం చేసేలా మారింది. నగరంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం పరిసరాల్లో మల్టీ లెవల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ పేరిట హెచ్ఎండీఏ చేస్తున్న నిర్మాణ పనులు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. దీంతో 1890 నాటి అద్భుత కట్టడానికి ప్రమాదం పొంచి ఉంది.
బేగంపేటలోని పైగా ప్యాలెస్ ప్రాంగణంలోని మర్దానా మహల్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారమే ఇదీ షెడ్యూల్ 2బీ కింద గుర్తించిన అత్యంత కీలకమైన హెరిటేజ్ సైట్‌గా మారింది. ఇలాంటి కట్టడాల విషయంలో ఇంటలిజెంట్ కన్జర్వేషన్ పాటించాలని, ఇవీ నగర అస్తిత్వానికి ప్రతీకలనీ హెచ్ఎండీఏ రూల్ బుక్ చెబుతోంది. కానీ ఇప్పుడు ప్యాలెస్ ప్రాంగణంలోని తోటలు, ఫౌంటెన్లను ధ్వంసం చేస్తూ అండర్ గ్రౌండ్ పార్కింగ్ నిర్మించ తలపెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 18 శతాబ్దానికి ఈ చెందిన ఈ అత్యంత సున్నితమైన కట్టడం పక్కనే మల్టీ లెవల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కోసం హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. ఇందుకోసం చేపట్టే పనుల వల్ల సున్నపు రాయి, సహజ రాళ్లతో నిర్మించిన ఇలాంటి భవనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.
ప్రస్తుతం అమీర్‌పేట్‌లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో ఉన్న హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని పైగా ప్యాలెస్‌కు మార్చేందుకు గతేడాది కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 5-6 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరమ్మతులు చేశారు. తాజాగా మరో ఏడు కోట్ల రూపాయలతో చేపట్టే అండర్ గ్రౌండ్ మల్టీ లెవల్ పార్కింగ్ యార్డ్‌కు ప్రణాళికలు రూపొందించారు. అయితే హెచ్ఎండీఏ చర్యలతో చారిత్రక కట్టడం మొత్తం ప్రమాదం వచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.