TGSWREIS : రాష్ట్రంలోని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్(TGSWREIS) కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం 2026-27లో మిగిలిన సీట్ల భర్తీకోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష తర్వాత కూడా కొన్ని సీట్లు మిగిలిపోవడంతో వాటిని సత్వరమే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అన్ని జిల్లాల్లో జూలై 6, సోమవారం రోజున కౌన్సెలింగ్ ఉంటుందని శుక్రవారం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య ఒక ప్రకటన విడుదల చేశారు.
టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆర్జేసెట్ -2026 నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఇంకా కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. దాంతో.. వీటిని స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అందుకని జూలై 6వ తేదీన జిల్లాల్లో అర్హులైన విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నట్టు కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
