సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చురుకుగా కదులుతున్న రుతుపవనాలకు తోడు దక్షిణ, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. వరదనీరు రోడ్లపై పారడంతో చాలా చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరదనీరు సాఫీగా వెళ్లేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేట్టారు. రాత్రి 8గంటల వరకు మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్‌లో అత్యధికంగా 9.4సెం.మీలు, షేక్‌పేటలో 9.2సెం.మీలు, జూబ్లీహిల్స్‌లో 9.1సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. రాగల మరో 3రోజులు గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.