హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): విష్ణు కథలు తల్లి గర్భంలో నుంచి విని ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యాడు. అర్జునుడు యుద్ధ విద్యల గురించి, పద్మవ్యూహం గురించి సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విన్నాడు. అంటే గర్భస్థ దశలోనే పిల్లలు నేర్చుకోవడం ఆరంభిస్తారన్నమాట. నేటి తరం తల్లులకు అచ్చం ఇలాంటి శిక్షణను హైదరాబాద్‌లోని రామకృష్ణమఠం అందిస్తున్నది. ‘ఆర్యజనని’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 2018 మార్చి 13న ప్రారంభమైంది. ఈ ఏడాదితో ఐదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రామకృష్ణమఠంలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు.

ఆరోగ్యకరమైన అలవాట్లు
ఇటీవలి కాలంలో పిల్లలు ఆటిజం, బుద్ధి మాంద్యం బారిన పడి మానసిక దివ్యాంగులుగా మారుతున్నారు. అనారోగ్యకరమైన అలవాట్లతోనే అనారోగ్యకరమైన పిల్లలు పుడుతున్నారని గ్రహించి దీనికి పరిష్కారంగా ఆర్యజనని కార్యక్రమానికి రామకృష్ణమఠం మార్గదర్శనంలో ఏర్పడ్డ బృందం దీనికి శ్రీకారం చుట్టింది. రామకృష్ణమఠం స్వామిజీ శితికంఠానంద ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేయగా, ఈ ఐదేండ్లలో 3 వేలకు పైగా తల్లులకు శిక్షణ నిచ్చారు. కరోనా కాలంలోనూ ఆన్లైన్ సెషన్లు నిర్వహించారు. ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారంలో 3 గంటల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ తర్వాత ఇంట్లోనే స్వతహాగా చేసుకునేలా ప్రోత్సహిస్తారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలతో పాటు, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల్లోని కొంతమంది గర్భిణులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఏం చేస్తారంటే..
ఆరోగ్యకరమైన పద్ధతులు నేర్పిస్తాం
గర్భస్థ దశలో ఉత్తమ సంతానం కోసం తాపత్రయపడితే పిల్లల్లో అనేక ప్రవర్తన లోపాలను నివారించగలం. ఇందుకోసమే ఆర్యజనని పనిచేస్తుంది. గర్భిణులు ఎలా నడుచుకోవాలి? వేటిని ఆచరించాలి? అన్న వాటిపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.
– లక్ష్మి, వర్క్‌షాప్ నిర్వాహకురాలు
పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శమూర్తులని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నారు. పుట్టబోయే పిల్లల సంరక్షణయే లక్ష్యంగా అవతరించిన ‘ఆర్యజనని’ సంస్థ 5వ వార్షికోత్సవాన్ని ఆదివారం రామకృష్ణమఠంలో ఘనంగా నిర్వహించారు. దీనికి స్వామిజీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి పిల్లలు నేర్చుకుంటారని చెప్పారు. ధర్మాచరణలో మంచితనంపై సంపూర్ణ విశ్వాసం ఉండాలని అన్నారు.
సంకుచిత స్వభావాలు వీడి ఆధ్యాత్మికతకు సంబంధించి మరింత సానుకూల వాతావరణం ఏర్పరచుకోవాలని సూచించారు. ఆర్యజనని రూపకర్త, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి శితికంఠానంద మాట్లాడుతూ పిల్లలకు షరతులు లేని ప్రేమను అందించాలని సూచించారు. స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస, బుద్ధుడు, శంకరాచార్య, రమణ మహర్షి వంటి వారి జీవిత గాథలను పిల్లలకు పరిచయం చేయాలని పేర్కొన్నారు. అనంతరం ధాత్రి మదర్ మిల్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆర్యజనని కార్యక్రమం స్ఫూర్తి రాష్ట్రమంతా వ్యాపించాలని చెప్పారు. అన్ని మెడికల్ కాలేజీలకు ఆర్య జనని ప్రాధాన్యతను తెలియజేస్తూ లేఖలు రాస్తామని అన్నారు. ఆర్యజనని కార్యదర్శి డాక్టర్ అనుపమ రెడ్డి మాట్లాడుతూ వర్షాప్ల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.