సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.5.88 లక్షల విలువజేసే 98 కిలోల గంజాయితో పాటు గంజాయి రవాణాకు ఉపయోగించిన రెండు కార్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా దుగ్గనాయక్ తండాకి చెందిన ప్రకాశ్ రాథోడ్ (24) తరచూ బీదర్ జిల్లాలోని విజయనగర్ తండాలో నివాసం ఉండే తన బంధువుల వద్దకు వెళ్తుంటాడు.
ఈ క్రమంలో స్థానికంగా ఉండే భానుదాస్ రాథోడ్(25), ముదావత్ నివర్తి(27), భీమ్రావు రాథోడ్(50), రవీంద్ర చవాన్(40)తో ప్రకాశ్ రాథోడ్‌కు పరిచయం ఏర్పడింది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి, వేర్వేరు ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి నగర శివారుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 24న ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి 98 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఒక్కో కిలో చొప్పున 98 ప్యాకెట్లలో గంజాయిని నింపారు. రెండు వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున మొయినాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న శంషాబాద్ ఎస్ఓటీ, మొయినాబాద్ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన బొలేరో వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కిలో బరువున్న 98 గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో బొలేరో, ఇండికా వాహనాల్లో ప్రయాణిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.