సుల్తాన్‌బజార్: యూజీ విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టల్ భవనం యూజీ విద్యార్థులకే కేటాయించాలంటూ.. బుధవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ వారితో చర్చించారు. పీజీ విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించేంత వరకు యూజీ హాస్టల్లోనే అకాడమినేషన్ ఇస్తామని విద్యార్థులను సముదాయించేందుకు ప్రయత్నించారు.
యూజీ విద్యార్థులు ససేమిరా అనడంతో ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నేను చెప్పిందే వేదం.. నా మాటను తిరస్కరిస్తే కేసులు పెడతా.. టీసీ ఇచ్చి ఇంటికి పంపుతా.. అని విద్యార్థులను బెదిరిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని యూజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూజీ గర్ల్స్ హాస్టల్‌ను పూర్తిగా యూజీలకే కేటాయించాలంటూ, యూజీల కోసం నిర్మించిన భవనంలో యూజీలకే వసతి కేటాయించాలంటూ ప్రిన్సిపాల్‌కు విన్నవించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ స్పందించకపోగా, న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులపై కేసులు పెడతా.. తల్లి దండ్రులకు ఫోన్ చేస్తా అని బెదిరించడం.. టీసీ ఇచ్చి ఇంటికి పంపుతా అంటూ విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు.