పేద రైతుల భూములు గుంజుకుం టూ సర్కారు రాక్షసానందం పొందుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ సర్కారు అనేకచోట్ల భూములు గుంజుకుంటూ రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. సర్కారు వద్దే వేలాది ఎకరాలున్నా మళ్లీ భూసేకరణ చేయడం ఎందుకని ప్రశ్నించారు. కాళ్లాపూర్, రాపోల్ రైతులు భూములు కోల్పోకుండా వారి వెంట ఉండి బీఆర్ఎస్ పోరాడుతుందని భరోసా ఇచ్చారు.
త్వరలోనే కాళ్లాపూర్, రాపోల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పర్యటించి రైతులకు బాసటగా నిలుస్తారన్నారు. శుక్రవారం మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులు చేపట్టిన రిలే దీక్షలో వికారాబాద్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి సబితాఇంద్రారెడ్డి రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతుల గోడు, మహిళల ఏడుపు చూస్తే తన గుండె బరువెక్కిందన్నారు. -పరిగి, ఏప్రిల్ 3
ఇండస్ట్రియల్ పార్కు భూ సేకరణపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని అనుకుంటే అర్ధాంతరంగా సమావేశాలను వాయిదా వేసినట్లు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.. రైతుల భూములను సర్కారు గుంజుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు. ఈనెల 7న మాజీ మంత్రి హరీశ్‌రావు కాళ్లాపూర్, రాపోల్ గ్రామాలకు వస్తారని, ఆ తర్వాత కేటీఆర్ వస్తారని.. రైతులు అధైర్యపడకుండా సంఘటితంగా ఉండాలన్నారు.
హైదరాబాద్ కోకాపేటలోని గోశాలకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకొని.. గోశాలకు ఎన్కెపల్లిలో భూములు ఇవ్వాలని నిర్ణయిం చి రైతులను విడదీసి విడతల వారీగా భూములను తీసుకుందన్నారు. ప్రభుత్వం భూసేకరణను రద్దు చేసుకుంటే సరి, లేదంటే ఎంతవరకైనా పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల భూములు ప్రభు త్వం వద్ద ఉన్నాయన్నారు. రాష్ర్టానికి పెట్టుబడులొస్తే ఇప్పుడున్న చందనవెల్లి, సీతారాంపురంలోని వెయ్యి ఎకరాలు, మోమిన్‌పేటలో వెయ్యి ఎకరాలు, రాకంచర్లలో 200 ఎకరాల భూములున్నాయని, ముందుగా వాటిలో కంపెనీలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వానికి సూచించారు.
అవన్నీ వదిలేసి పేదల భూములను లాక్కొని సర్కారు రాక్షసానందం పొందుతున్నదని మండిపడ్డారు. రైతులు కన్నీరు పెడితే రాష్ర్టానికి మంచిది కాదన్నారు. రైతులు భూములను పడావు పెట్టొద్దని.. దున్ని సాగు చేయాలని.. పోలీసులు వస్తారా..? కలెక్టర్ వస్తారా..? స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఆపుతారో చూద్దామన్నారు. కేసులు పెడితే ఏమి కాదని, తాము అండగా ఉంటామన్నారు. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఇప్పటికే 50 వేల ఎకరాల వరకు రైతులను భయపెట్టి గుం జుకొని ఉంటారని సబితారెడ్డి ఆరోపించారు. రైతుల భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన, ప్రజాపాలనా అని ప్రశ్నించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుందని .. ఏ సమస్య వచ్చినా మహేశ్‌రెడ్డి మీతో ఉంటారని, నాకు చిన్న మెసేజ్ పెడితే చాలు అర్ధరాత్రైనా వస్తానని అభయమిచ్చారు. అన్నదాతల సంక్షేమానికి కేసీఆర్ ఎంతో ఆలోచించేవారని గుర్తు చేశారు.
అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని ఎన్నికల్లో చెప్పిన రేవంత్‌రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని సబితారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచించి భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. రైతుల తరఫున పోరాటం చేస్తున్న కాళ్లాపూర్ సర్పంచ్‌ను సబితారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు ఏడవడంతో వారిని సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు. కార్యక్రమంలో దోమ మాజీ జడ్పీటీసీ నాగారెడ్డి, పరిగి మాజీ ఎంపీపీ అరవిందరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, కాళ్లాపూర్ సర్పంచ్ పుల్లయ్య, నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డి, జగన్, రవికుమార్, కృష్ణ, రవి, జంగయ్య, జంగయ్య పాల్గొన్నారు.