Tongue Color | మనం తినే ఆహారానికి సంబంధించి వాసనను చూపే శక్తి ముక్కుకు ఉంటుంది. వాసన చూడగానే కొన్ని వంటకాలను తినాలనిపిస్తుంది. ఇక నాలుక ద్వారా ఆ వంటకాలను రుచి చూస్తాం. అయితే నాలుక అనేది కేవలం రుచిని తెలపడం మాత్రమే కాదు, ఇంకా అనేక పనులు చేస్తుంది. మనకు కలిగే అనారోగ్య సమస్యలు లేదా వ్యాధులకు సంబంధించిన లక్షణాలను అది ముందుగానే తెలియజేస్తుంది. అందుకనే డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు వారు ముందుగా నాలుకను చూస్తారు. దీంతో మనకు ఉన్న రోగాలను వారు సులభంగా గుర్తించగలుగుతారు. మనకు వచ్చే అనేక వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ముందుగా నాలుకపైనే మనకు తెలుస్తాయి. కొన్ని రకాల వ్యాధులు ఉన్నప్పుడు నాలుక రంగు మారడం లేదా నాలుకపై పూత, పుండ్లు రావడం, తెల్లగా లేదా ఇతర రంగుల్లో పూత వేసినట్లు కనిపించడం వంటివి నాలుకపై దర్శనమిస్తుంటాయి. వాటిని బట్టి డాక్టర్లు మనకు వచ్చిన వ్యాధిని నిర్దారించి అందుకు అనుగుణంగా చికిత్స ఇస్తారు. అయితే నాలుక ఉన్న పరిస్థితిని బట్టి మనం కూడా కొన్ని రకాల వ్యాధులను ముందుగానే తెలుసుకోవచ్చు.
నాలుక చాలా వరకు లైట్ పింక్ రంగులో ఉంటుంది. ఎలాంటి రోగం లేదా అనారోగ్య సమస్య లేకుండా ఆరోగ్యవంతంగా ఉన్నవారి నాలుక ఇలా లేత పింక్ రంగులో దర్శనమిస్తుంది. ఇలా నాలుక ఉంటే ఎలాంటి రోగాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని అర్థం చేసుకోవాలి. అయితే ఇలా నాలుక ఉన్నప్పుడు దానిపై కాస్త తెల్లని పూత ఉన్నా ఫర్వాలేదు. ఆరోగ్యంగానే ఉన్నారని గుర్తించాలి. ఇక నాలుకపై తెల్లని రంగు పూత మరీ అధికంగా ఉంటే అలాంటి వారు నోటి సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. నోరు శుభ్రంగా లేకపోయినా, దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నా లేదా శరీరం డీహైడ్రేషన్ బారిన పడినా ఇలా నాలుకపై తెల్లని పూత అధికంగా కనిపిస్తుంది. అలాగే ఫ్లూ వంటి సమస్యలు ఉన్నా ఇలాగే అవుతుంది. కనుక నాలుకపై తెల్లని పూత మరీ అధికంగా ఉంటే అలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి తగిన అనారోగ్య సమస్యను గుర్తించి అందుకు అనుగుణంగా డాక్టర్ చే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నాలుకపై ఉండే తెల్లని పూత తొలగిపోతుంది. అలాగే అనారోగ్య సమస్య కూడా తగ్గుతుంది.
నాలుక మీద పసుపు రంగులో కనిపిస్తుంటే మీ శరీరంలో పోషకాలు నశించాయని, పోషకాల లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఎలాంటి పోషక పదార్థం లోపించినా సరే నాలుక ఇలాగే కనిపిస్తుంది. కనుక ఏ లోపం ఉందనేది గుర్తించేందుకు గాను డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ పోషక పదార్థ లోపాన్ని తగ్గించుకోవచ్చు. రోగాలు రాకుండా ఉంటాయి. సాధారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోయినా, లివర్ లేదా జీర్ణాశయ సంబంధిత సమస్యలు ఉన్నా నాలుక అలా మనకు పసుపు రంగులో దర్శనమిస్తుంది. లేదా పోషకాల లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంది. కనుక దీనికి సరైన కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నాలుక గోధుమ రంగులో ఉందంటే మీరు కెఫీన్‌ను అధికంగా తీసుకుంటున్నారని గుర్తించాలి. కెఫీన్ సాధారణంగా టీ, కాఫీలలో ఉంటుంది. కనుక మీరు రోజూ అతిగా టీ, కాఫీలను తాగుతుంటే ఆ అలవాటును మానుకోవాలి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇక నాలుక మీద నలుపు రంగులో కనిపిస్తుంటే మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా క్యాన్సర్ ఉన్నవారికి నాలుక ఇలా నలుపు రంగులో కనిపిస్తుంది. పొగ తాగేవారికి ఇలా ఎక్కువగా నాలుక దర్శనమిస్తుంది. అలాగే జీర్ణాశయ అల్సర్లు, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో, నోట్లో సరిగ్గా శుభ్రత పాటించకపోయినా, నాలుకపై బ్యాక్టీరియా మరీ అధికంగా ఉన్నా కూడా నాలుక నలుపు రంగులో కనిపిస్తుంది. కనుక ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక నాలుక మరీ ఎరుపు రంగులో కనిపిస్తుంటే విటమిన్ బి12 లోపం ఉందని గుర్తించాలి. విటమిన్ బి12 ఉండే ఆహారాలను తింటుంటే ఈ సమస్య తొలగిపోతుంది. అలాగే నాలుక నీలం లేదా పర్పుల్ రంగులో ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే గుండె సమస్యలు ఉన్నవారికి నాలుక ఇలా ఈ రంగులో కనిపిస్తుంది. గుండె తగినంత రక్తాన్ని లేదా ఆక్సిజన్‌ను పంపించలేకపోతే ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ రంగులో నాలుక ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే అలర్ట్ అయి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నాలుక రంగును బట్టి మనకు ఉన్న అనారోగ్య సమస్యలు, రోగాలను చాలా సులభంగా గుర్తించవచ్చు.