Pop Corn | థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు చాలా మంది కచ్చితంగా పాప్ కార్న్ తింటుంటారు. అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా పాప్ కార్న్ అనేది బెస్ట్ స్నాక్స్‌గా ఉంటుంది. అయితే కేవలం ఈ సందర్భాల్లోనే కాదు వాస్తవానికి పాప్ కార్న్‌ను తరచూ తినాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. పాప్ కార్న్‌ను తరచూ తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. అయితే పాప్ కార్న్ మనకు అనేక ఫ్లేవర్లలో లభిస్తుంది. కానీ ఎలాంటి ఫ్లేవర్ లేని ప్లెయిన్ పాప్ కార్న్‌ను తింటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. పాప్ కార్న్ తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభించడమే కాదు, శక్తి కూడా అందుతుంది. అలాగే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు కూడా.
పాప్ కార్న్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. 3 కప్పుల పాప్ కార్న్‌ను తినడం వల్ల సుమారుగా 4 గ్రాముల మేర ఫైబర్‌ను పొందవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. పాప్ కార్న్‌లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలని చూస్తున్నవారు పాప్ కార్న్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పాప్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. అందువల్ల ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. పాప్ కార్న్‌లో లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకుంటాయి.
పాప్‌కార్న్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. పాప్ కార్న్‌లో ఉండే పాలిఫినాల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచి రక్షిస్తాయి. బీపీ రాకుండా చూస్తాయి. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. పాప్ కార్న్ తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువను కలిగి ఉంటుంది. అందువల్ల పాప్ కార్న్‌ను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. కనుక పాప్ కార్న్‌ను తింటే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. పాప్ కార్న్‌ను తినడం వల్ల అనేక రకాల బి విటమిన్లు లభిస్తాయి. ఇవన్నీ మనకు రోగాలు రాకుండా చూస్తాయి. ఇలా పాప్ కార్న్‌ను తరచూ తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. కానీ అందులో చాక్లెట్, ఉప్పు వంటివి కలపకుండా తినండి. అప్పుడే లాభాలను పొందగలుగుతారు.