Foods | ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా చాలా మంది అస్తవ్యస్తమైన జీవనశైలిని పాటిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ ఉండడం లేదు. ఇష్టం వచ్చిన సమయానికి ఏది పడితే దాన్ని తింటున్నారు. సాయంత్రం అయిందంటే చాలు.. జంక్ ఫుడ్‌ను విపరీతంగా లాగించేస్తున్నారు. ఇక రాత్రి పూట అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాన్ని ఆలస్యంగా తింటున్నారు. ఇలా ఆహారం విషయంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలను పాటించకపోవడం వల్ల అధికంగా బరువు పెరుగుతున్నారు. డయాబెటిస్ వస్తోంది. గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే రాత్రి పూట కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి కలిగే హాని నుంచి కొంత వరకు అయినా తప్పించుకున్న వారు అవుతారు. రాత్రి సమయంలో కొన్ని ఆహారాలను తినడం మానేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు.
రాత్రి పూట చాలా మంది కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తింటుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ కూరలు, బిర్యానీ, పులావ్ వంటి ఆహారాలను తింటుంటారు. అయితే రాత్రి పూట వీటిని తింటే జీర్ణాశయంలో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్తి ఏర్పడుతుంది. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. దీంతో రాత్రి పూట సరిగ్గా నిద్ర ఉండదు. ఇది మళ్లీ ఇతర వ్యాధులకు కారణమవుతుంది. కనుక రాత్రి పూట కారం, మసాలా ఆహారాలను తినడం మానేయాలి. అలాగే పకోడీలు, సమోసాలు, నూనె అధికంగా వేసి తయారు చేసే వేపుళ్లు, నూనె పదార్థాలు, ఇతర జంక్ ఫుడ్‌ను కూడా రాత్రి పూట తినకూడదు. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. పొట్టలో గ్యాస్ ఏర్పడేలా చేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం వస్తుంది. రాత్రి పూట నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
రాత్రి పూట చాలా మంది రెస్టారెంట్లను తెప్పించుకున్న ఫుడ్‌ను తింటారు. లేదా బయటకు వెళ్లి భోజనం చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి నాన్ వెజ్ ఆహారాలను బయట అధికంగా తింటుంటారు. వీటిని రాత్రి పూట తినడం అంత మంచిది కాదు. ఉదాహరణకు కబాబ్స్, బటర్ చికెన్ వంటి వాటిల్లో కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రాత్రి పూట జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక రాత్రి వీటిని తీసుకోవడం మానేయాలి. అలాగే చక్కెర అధికంగా ఉండే ఆహారాలను లేదా స్వీట్లను రాత్రి పూట తినకూడదు. ఇవి షుగర్ లెవల్స్‌ను విపరీతంగా పెంచుతాయి. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఇలా చేస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
కొందరు రాత్రి పూట భోజనం చేసిన అనంతరం టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. ఇలా చేస్తే కెఫీన్ శరీరంలో అధిక మొత్తంలో చేరుతుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కనుక రాత్రి పూట టీ, కాఫీలను తాగకూడదు. అయితే అంతగా తాగాలనిపిస్తే హెర్బల్ టీలను సేవించవచ్చు. కమోమిల్ టీని రాత్రి పూట సేవిస్తే మైండ్ రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది. అదేవిధంగా రాత్రి పూట ప్రాసెస్ చేయబడిన ఆహారాలను కూడా తినకూడూదు. నూడుల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను రాత్రి తినకూడదు. వీటిల్లో అధికంగా ఉండే సోడియం డీహైడ్రేషన్‌ను కలగజేస్తుంది. దీంతో కిడ్నీలపై భారం పడుతుంది. దీర్ఘకాలంలో కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఈ ఫుడ్స్‌ను కూడా మానేయాల్సి ఉంటుంది. ఇలా రాత్రి పూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. బరువు పెరగకుండా ఉంటారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.