Veg Protein Foods | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాల విషయానికి వస్తే వాటిల్లో ప్రోటీన్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ప్రోటీన్ల వల్ల కణాలకు మరమ్మత్తు జరుగుతుంది. కొత్త కణాలు ఏర్పడేందుకు ప్రోటీన్లు సహకరిస్తాయి. కనుక ప్రోటీన్లను మనం రోజూ తగినంత మోతాదులో తినాలి. 18 ఏళ్లకు పైబడిన వారికి రోజుకు కనీసం 30 గ్రాముల మేర ప్రోటీన్లు కావాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రోటీన్ల విషయానికి వస్తే చాలా మందికి నాన్‌వెజ్ ఆహారాలు గుర్తుకు వస్తాయి.
ప్రోటీన్లు అంటే కేవలం నాన్ వెజ్ ఆహారాల్లోనే ఉంటాయని అనుకుంటారు. కోడిగుడ్లతోపాటు చికెన్, మటన్, ప్రాన్స్, చేపలు వంటి వాటిల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయని భావిస్తారు. అయితే అది నిజమే అయినా ప్రోటీన్ల కోసం రోజూ నాన్ వెజ్ తినలేరు కదా. అందుకని వెజ్ ఆహారాలను కూడా తినాలి. ఇక వెజ్ ఆహారాల విషయానికి వస్తే పలు ఫుడ్స్‌లోనూ మనకు ప్రోటీన్లు లభిస్తాయి. వాటిల్లో పనీర్ ముఖ్యమైందని చెప్పవచ్చు. పాలను విరగ్గొట్టి తయారు చేసే పనీర్‌లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నాన్ వెజ్ తినలేని వారు తరచూ పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే సోయాబీన్‌తో తయారు చేసే తోఫులోనూ ప్రోటీన్లు సమృద్ధిగానే ఉంటాయి.
తోఫు మన శరీరానికి తప్పనిసరిగా కావల్సిన 9 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. అలాగే తోఫులో ఐరన్, క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల తోఫు లేదా పనీర్‌ను తింటే గుండె జబ్బులు, కీళ్ల జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ వ్యాధులు ఉన్న వారు వీటిని తప్పనిసరిగా తినాలి. అదేవిధంగా పిస్తా పప్పులోనూ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు పప్పు తింటే ఎన్నో ప్రోటీన్లను పొందవచ్చు. పిస్తాను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో తినవచ్చు. నానబెట్టి తింటే మంచిది. సులభంగా జీర్ణం అవుతాయి. పిస్తా పప్పులో మనకు ఉపయోగపడే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి వీటిని రోజూ తినాలి.
పెసలు, బొబ్బర్లు, రాజ్మా వంటి పప్పు దినుసులను చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ ఈ పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. చికెన్, మటన్ తినలేని వారు తరచూ ఈ పప్పులను తినవచ్చు. ఒక కప్పు పప్పు ధాన్యాల ద్వారా మనకు 18 గ్రాముల మేర ప్రోటీన్ లభిస్తుంది. ఇది దాదాపుగా 100 గ్రాముల మాంసం ద్వారా లభించే ప్రోటీన్లకు సమానం అని చెప్పవచ్చు. అందుకని పప్పు ధాన్యాలను తరచూ తింటుండాలి. దీంతో ప్రోటీన్లు లభిస్తాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కణాలు నిర్మాణం అవుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.