Food Poisoning | ఆహార భద్రత ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి నేరుగా సంబంధించిన అంశం. అయితే ప్రపంచవ్యాప్తంగా కలుషితమైన ఆహారం ఇప్పటికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరించింది. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు లేదా రసాయనాలతో కలుషితమైన ఆహారం కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించింది. 2000 నుంచి 2021 వరకు 194 దేశాలకు సంబంధించిన డేటాను విశ్లేషించిన WHO, ప్రతి సంవత్సరం దాదాపు 88.6 కోట్ల మంది అసురక్షిత ఆహారం వల్ల వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారని గుర్తించింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు ఈ ప్రమాదానికి అత్యధికంగా గురవుతున్నారని నివేదిక పేర్కొంది. చిన్నారుల్లో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదం పెద్దలతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఆహార భద్రత కేవలం ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని WHO స్పష్టం చేసింది. ప్రతి భోజనం, ప్రతి కుటుంబం, ప్రతి రోజూ దీనితో ముడిపడి ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల సంఖ్య గత రెండు దశాబ్దాల్లో కొంత మేర తగ్గినప్పటికీ, ప్రాంతాల మధ్య తీవ్ర అసమానతలు కొనసాగుతున్నాయని అధ్యయనం వెల్లడించింది. ఆఫ్రికా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లోనే ప్రపంచంలోని మొత్తం ఆహార సంబంధిత అనారోగ్య కేసుల్లో దాదాపు మూడు వంతులు నమోదవుతున్నాయి. అలాగే మొత్తం మరణాల్లో 60 శాతం ఈ ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయి.
2021లో నమోదైన సుమారు 86 కోట్ల ఆహార సంబంధిత అనారోగ్య కేసుల్లో ఎక్కువ భాగం బ్యాక్టీరియా, వైరస్లు వంటి జీవ సంబంధిత ప్రమాదాల వల్లే సంభవించినట్లు WHO గుర్తించింది. ఇవే ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే మరణాల విషయంలో రసాయన కాలుష్యం మరింత ప్రమాదకరంగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆర్సెనిక్, సీసం (లెడ్)లను విషప్రభావం జీవ సంబంధం లేని ప్రధాన ప్రమాద కారకాలుగా గుర్తించారు. వాతావరణ మార్పులు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని WHO అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పుల ప్రభావంతో ఆహారం కలుషితమయ్యే ప్రమాదం అధికమవుతోందని వారు హెచ్చరించారు. అలాగే యాంటీ బయోటిక్ నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) పెరగడం వల్ల సంక్రమణలకు చికిత్స చేయడం మరింత కష్టతరమవుతోందని పేర్కొన్నారు.
ఆరోగ్య ప్రభావాలతోపాటు ఆహార సంబంధిత వ్యాధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ భారం మోపుతున్నాయి. 2021లో మాత్రమే ఈ వ్యాధుల కారణంగా ఉత్పాదకత తగ్గిపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు 647 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధ్యయనం అంచనా వేసింది. ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయడం, పరిశుభ్రత పాటించడం, సరిగ్గా వండిన ఆహారాన్ని తీసుకోవడం, శుభ్రమైన నీటిని వినియోగించడం వంటి చర్యలు ఆహార సంబంధిత వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఆహార భద్రతపై మరింత అవగాహన అవసరమని WHO పేర్కొంది.