Mental Health Day | ‘కొన్ని రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను.. ఆ సమయంలో నా ఆరోగ్యం చాలా చెడిపోయింది.. ’ ఇలాంటి మాటలు చాలా మంది మన సినీ తారలు చెప్పడం మనం వినివుంటాం. వీళ్లెందుకు డిప్రెషన్లోకి వెళ్లిపోతారు.. వీరు ఎందుకు ఒత్తిడికి గురవుతారు.. వీరి ఆందోళన ఏంటి.. అనే ప్రశ్నలు మనలో సహజంగా వస్తుంటాయి. వీటికి అనేక కారణాలు ఉంటాయని, పనికి రాని విషయాల గురించి పదే పదే ఆలోచిస్తూ మెదడుపై భారం మోపడం వల్లనే మానసిక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని, కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటారని వైద్యులు చెప్తుంటారు. ఇవాళ మానసిక ఆరోగ్య అవగాహన దినం. ఈ సందర్భంగా మానసిక ఆరోగ్య సమస్యలను వ్యాయామాలతో ఎలా పరిష్కరించుకోవచ్చునో తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కలు చెప్తున్నాయి. ఒత్తిడి అనేది రెండో అతిపెద్ద వ్యాధిగా తయారైందని విచారం వ్యక్తం చేసింది. నానాటికి పెరిగిపోతున్న మానసిక దౌర్భల్య భారాన్ని దీనితో ముడిపడి ఉన్న సాంఘిక, ఆర్థిక భారాలను పరిష్కరించడం ద్వారా దూరం చేసుకోవచ్చునని దీనిపై అధ్యయనం చేసిన పలువురు సెలవిచ్చారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం దగ్గరి సంబంధాలు కలిగి ఉండి.. వివిధ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది.
ఒత్తిడితో చిత్తవుతున్నాం..
మన జీవితాలు నిత్యం ఉరుకుల పరుగులమయంగా మారుతున్నాయి. ఆఫీసులో పని ఒత్తిళ్లు, బయట కుటుంబం ఒత్తిళ్లు.. ఫలితంగా ఆందోళన, డిప్రెషన్‌కు గురవుతున్నాం. ప్రస్తుత రోజుల్లో డిప్రెషన్ కేసులు టీనేజర్లలోనే అధికంగా కనిపిస్తున్నాయి. చాలా మంది తాము అనుకున్నది జరుగకపోయే సరికి డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. వీటి నుంచి బయటపడాలంటే వ్యాయామం ఒక్కటే ఉత్తమమైన మార్గం.
నిత్యం అర్ధ గంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, అనేక ఇతర సమస్యలపై వ్యాయామం పోరాడుతుంది. ఇదే సమయంలో, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా వ్యాయామం శక్తివంతమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. వ్యాయామం శరీరంపైనే కాకుండా మన మెదడుపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపి మనల్ని ఆరోగ్యవంతంగా ఉండటంలో సహకరిస్తుంది.
నిరాశ, ఆందోళనతో పోరాడాలి..
వ్యాయామం డిప్రెషన్, ఆందోళన లక్షణాలను తగ్గించగలదని శాస్త్రీయంగా నిరూపితమైంది. వ్యాయామం చేయడం వలన శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ వంటి మంచి అనుభూతిని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. మంచి అనుభూతిని కలిగిస్తాయి. దీని కోసం ఎక్కడో జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటిపట్టున కూడా వ్యాయామాలు చేయొచ్చు.
మెదడు శక్తిని పెంపొందించుకోవాలి..
వ్యాయామం చేయడం వల్ల మెదడుకు ఎక్కువ రక్తాన్ని అందుతుంది. ఫలితంగా మెదడు క్షీణతను నిరోధించడమే కాకుండా మెరుగైన జ్ఞాపకశక్తి, దృష్టి, ఏకాగ్రతకు దారితీసే న్యూరోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా కొత్త మెదడు కణాలను సృష్టించేందుకు సహాయపడుతుంది. అంటే బాగా ఆలోచించడం, మంచి ఏకాగ్రతను కలిగి ఉంటారన్నమాట.
ఒత్తిడిని తగ్గించుకోవాలి..
వ్యాయామం కారణంగా హృదయ స్పందన పెరుగుతుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు శ్వాస వ్యాయామాలను చేయడం చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఒత్తిడికి ప్రతిస్పందించే శరీరం సామర్థ్యం మెరుగవుతుంది. సాధారణ నడకను అలవాటు చేసుకోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను తగ్గిస్తుంది. చేయాల్సిన పనులపై దృష్టిపెట్టకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా అంతకు రెండింతలు పనులు చేయొచ్చు.
ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలి..
కొన్ని వ్యాయామాలు శారీరక రూపాన్ని ప్రభావితం చేస్తాయి. కండరాల స్థాయి మెరుగుపడుతుంది. సన్నగా, బలంగా కనిపిస్తారు. ఇది మరింత సానుకూల అనుభూతిని కలిగిస్తుంది. ఇదే మన విశ్వాసాన్ని పెంచుతుంది. తద్వారా ఆత్మగౌరవం పెరుగుతుందని గుర్తించాలి. మనపై మనకు అపారమైన గౌరవాన్ని కలిగి ఉండటం ద్వారా డిప్రెషన్‌కు గురికాకుండా చూసుకోవచ్చు.
కండి నిండా నిద్రపోవాలి..
నిద్ర మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మనం నిత్యం 8 గంటలకు తక్కువ కాకుండా నిద్ర పోవడం వల్ల శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. ఫలితంగా మనం రిఫ్రెష్‌ను పొంది డిప్రెషన్ రాకుండా చూసుకోగలం. వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయి త్వరగా నిద్ర కలుగుతుంది. వ్యాయామం అనే శారీరక శ్రమ మనలోని సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా ఎంతో విశ్రాంతిని పొంది మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పొందగలుగుతాం.
చివరగా..
వ్యాయామం చేయడానికి జిమ్‌కి వెళ్లడం ఇష్టం లేకపోతే ఇంటి వద్దనే చిన్న చిన్న వ్యాయామాలను ఎంచుకోవచ్చు. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇష్టమైన ఆట ఆడటం, డ్యాన్స్ లేదా మార్షల్ ఆర్ట్స్ వంటి కార్యాచరణను ఎంచుకోవచ్చు. తోట పనులు చేపట్టడం ద్వారా కూడా మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. యోగ, ధ్యానం అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని చిత్తుచేసి ప్రశాంత జీవనానికి బాటలు వేసుకోవచ్చు.