మన రక్తం మనల్ని బతికిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతరుల జీవం నిలబెడుతుంది. రక్తం అమృతభాండం లాంటిది. పంచుకున్నకొద్దీ పెరుగుతుంది. ప్రమాదాల్లోనో, ప్రసూతి సమయంలోనో, శస్త్ర చికిత్సల కారణంగానో ఎవరికి రక్తం అవసరమైనా.. స్వచ్ఛందంగా అందిద్దాం. మన
రక్తంలో మానవత్వం ప్రవహిస్తున్నదని నిరూపించుకుందాం (జూన్ 14- ప్రపంచ రక్తదాతల దినోత్సవం).
శరీరంలోని వివిధ అవయవాలకు ప్రాణవాయువును చేరవేసే వాహకం.. రక్తం. మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో, రక్తమూ అంతే ప్రధానం. శ్వాస ద్వారా మనం తీసుకున్న ప్రాణవాయువును ప్రధాన అవయవాలైన.. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు అన్ని అంతర్గత భాగాలకూ అందిస్తుంది రక్తం. రోడ్డు ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరిగినప్పుడు రోగి శరీరంలోని రక్తం ధారాపాతంగా బయటికి పోతుంది. ఫలితంగా ఒంట్లోని రక్తం తగ్గిపోతుంది. మెదడు, గుండె తదితరాలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో.. ఆక్సిజన్ కూడా అందదు. వివిధ అవయవాలు పనిచేయడం మానేస్తాయి.
ఈ పరిస్థితుల్లో రోగి మరణించే ఆస్కారమూ ఉంది. కాబట్టే ప్రమాదాల్లో తీవ్ర రక్తస్రావానికి గురైనవారికి తక్షణం రక్తం ఎక్కిస్తారు వైద్యులు. మహిళల విషయానికొస్తే.. చాలా మందికి కాన్పుల సమయంలో రక్తస్రావం జరుగుతుంది. అలాంటప్పుడు బయటి నుంచి రక్తం అవసరం అవుతుంది. గుండె, కాలేయం, కిడ్నీలు తదితర భాగాలకు శస్త్రచికిత్సలు జరిగినప్పుడు, ఇతర ఆపత్సమయాల్లోనూ రోగులకు రక్తం ఎక్కించాల్సిందే. ఆలస్యమైనకొద్దీ ప్రాణగండమే. ఈ క్రమంలోనే రక్తదానానికి ప్రాధాన్యం పెరిగింది. రక్తదాన ఆవశ్యకతను జనంలోకి తీసుకెళ్లి.. రక్తదాతలను ప్రోత్సహించే క్రమంలో ఏటా జూన్ 14ను ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’గా జరుపుకొంటారు. ఎముక మజ్జ రక్తానికి జన్మస్థానం.
తొమ్మిది రకాలు రక్తంలో ఎనిమిది ప్రధాన గ్రూపులతోపాటు, మరొక అరుదైన గ్రూపు కూడా ఉంది. ఆ ఎనిమిదిలో నాలుగు పాజిటివ్ అయితే, నాలుగు నెగెటివ్. సుమారు 90 శాతం మంది పాజిటివ్ గ్రూపులకు చెందిన రక్తాన్నే కలిగి ఉంటారు. అందులో ఎక్కువ మంది ‘ఒ-పాజిటివ్’ పరిధిలోకి వస్తారు. రెండో స్థానంలో ‘ఎ-పాజిటివ్’, మూడో స్థానంలో ‘బి-పాజిటివ్’, నాలుగో స్థానంలో ‘ఎబి-పాజిటివ్’ ఉంటారు. ఇవి కాకుండా.. ఎ-నెగెటివ్, బి-నెగెటివ్, ఎబి-నెగెటివ్, ఒ-నెగెటివ్ గ్రూపులూ ఉంటాయి. ఈ ఎనిమిదింటిలో ‘ఎబి-నెగెటివ్’ అరుదైంది. ప్రతి వెయ్యిమందిలో ఆరుగురికి మాత్రమే ఈ గ్రూపు రక్తం ఉంటుంది. ఇక, అన్నిటికంటే అపురూపమైంది ‘బాంబే బ్లడ్ గ్రూప్’.
ఒ-పాజిటివ్ రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో పాజిటివ్ గ్రూప్‌కు చెందిన.. అంటే ఎ-పాజిటివ్, బి-పాజిటివ్, ఎబి-పాజిటివ్ వ్యక్తులకు ఎక్కించవచ్చు. కానీ, నెగెటివ్ గ్రూపులకు అంటే.. ఎ-నెగెటివ్, బి-నెగెటివ్, ఎబి-నెగెటివ్, ఒ-నెగెటివ్ గ్రూపుల వారికి అస్సలు ఎక్కించకూడదు. అలా చేస్తే ప్రాణాంతకం కూడా. ఒ-నెగెటివ్ రక్తాన్ని మాత్రం అన్నిరకాల పాజిటివ్, నెగెటివ్ గ్రూపుల రోగులకు ఎక్కించవచ్చు. అందుకే దీన్ని ‘యూనివర్సల్ డోనర్’ అని పిలుస్తారు.
1952లో మొదటి సారిగా డాక్టర్ భేండే అనే వైద్యుడు.. ముంబైలో ఈ అరుదైన గ్రూపును గుర్తించారు. కాబట్టే, దీనికి బాంబే బ్లడ్‌గ్రూప్ అని పేరు
పెట్టారు. పదివేల మందిలో ఒకరికి మాత్రమే ఈ తరహా రక్తం ఉంటుంది. బాంబే గ్రూపు వ్యక్తులకు ఆ గ్రూపునే ఎంచుకోవాలి. మరే ఇతర రకాన్నీ
ఇచ్చేందుకు వీలులేదు.
సాధారణంగా దాతల ద్వారా సేకరించిన రక్తం నుంచి రెండు రకాల ద్రవాలను, రెండు రకాల కణాలను తీస్తారు. అందులో ముఖ్యమైంది ‘ప్యాక్డ్ రెడ్ బ్లడ్‌సెల్స్’. ‘రెడ్ బ్లడ్‌సెల్స్’ అనీ అంటారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా.. అనే అనే నాలుగు ప్రధాన పదార్థాలు ఉంటాయి. వీటినే ‘కాంపొనెంట్స్’గా వ్యవ హరిస్తారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని ప్రత్యేక పద్ధతి ద్వారా వేరు చేస్తారు. ఆ ప్రక్రియలో ఎర్ర రక్తకణాలన్నీ అడుగు భాగానికి చేరుకుంటాయి. ప్లాస్మా పైకి తేలుతుంది. ప్లేట్లెట్స్ మధ్యభాగంలో ఉండిపోతాయి. వీటిని ప్రత్యేక పద్ధతి ద్వారా వేరుచేస్తారు. అవసరాన్ని బట్టి రోగులకు ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు.
ఎర్రరక్త కణాలున్న ద్రవాన్ని రెడ్ బ్లడ్‌సెల్స్(ఆర్బీసీ) అంటారు. ఎర్ర రక్తకణాలు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తాయి. ఎర్ర రక్తకణాలను 43 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి వంటి శస్త్ర చికిత్సలు, కాన్పులు, ప్రమాదాల సమయంలో ఎక్కిస్తారు. పరిస్థితి తీవ్రతను బట్టి రక్తహీనత ఉన్న వారికి కూడా ఎర్ర రక్త కణాలను అందిస్తారు.
ప్లేట్లెట్స్ రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరం నుంచి ధారాపాతంగా కారిపోకుండా అడ్డుపడతాయి. శస్త్ర చికిత్సలు, రోడ్డు ప్రమాదాల్లో రోగికి తీవ్ర రక్తస్రావం జరిగినప్పుడు.. ఈ కణాలను ఎక్కిస్తారు. క్యాన్సర్, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలినప్పుడు రోగి శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. అప్పుడు కూడా ఈ కణాల అవసరం ఏర్పడుతుంది. ప్లేట్లెట్స్ కణాలను ఐదు రోజులు నిల్వ చేయవచ్చు.
అగ్ని ప్రమాద బాధితులకు ఎక్కువగా ప్లాస్మా ఎక్కిస్తారు. ఇలాంటి సందర్భంలో ఒంటిమీది చర్మం కాలిపోయి మాంసం తేలుతుంది. రక్తంలోని ద్రవ పదార్థం ఆవిరైపోతుంది. ప్లాస్మాకు శరీరంలోని విష పదార్థాలను నిరోధించే శక్తి ఉంటుంది. కాలిన గాయాల వల్ల ప్లాస్మా ఆవిరైపోవడంతో శరీరంలో విషపదార్థాలు పేరుకుంటాయి. దీన్నే ‘ఇన్ఫెక్షన్’ అంటారు. ప్లాస్మా తగ్గేకొద్దీ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయి. ప్లాస్మాను నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద సంవత్సరం పాటు నిల్వ ఉంచవచ్చు. అగ్ని ప్రమాద బాధితులకు, దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగ్రస్తులకు ప్లాస్మాను ఎక్కువగా వినియోగిస్తారు. అలాంటివారికి సంజీవినిలా పనిచేస్తుంది.
సాధారణంగా, రక్తదాన సమయంలో ఒక వ్యక్తి నుంచి 450 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తం సేకరించే ముందు దాతకు కొన్ని పరీక్షలు చేస్తారు. రక్తదానం చేసేవారికి కొన్ని అర్హతలు కూడా ఉండాలి.
కాబట్టి, ఒకసారి రక్తదానం చేసినవారు, కనీసం మూడు మాసాల తరువాత మరో రక్తదానానికి సిద్ధం కావచ్చు. ఇంకో ప్రాణాన్ని నిలబెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయవచ్చు. రక్తదానాన్ని మించిన మహాదానం లేదు. రక్తం ఇవ్వడం అంటే.. అమృతాన్ని ప్రసాదించడమే. అపోహలను, భయాలను వదిలిపెట్టి అర్హులంతా రక్తదానానికి ముందుకు రావాలి. కాకపోతే రక్తదానానికి వెళ్లేముందు కొన్ని జాగ్రత్తలూ అవసరం. ముందురోజు కంటినిండా నిద్రపోవాలి. రక్తదానానికి ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా మంచినీళ్లు తాగాలి. దీర్ఘకాలంగా ఏవైనా మందులు వాడుతుంటే.. ఆ విషయాన్ని తెలియజేయాలి.
రక్తం లేకపోతే మనిషి బతకలేడు. శరీరంలో ప్రవహించే రక్తం మెదడు, గుండెతో పాటు ఇతర అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. రక్త ప్రసరణ తగ్గిపోయినా, సరఫరా నిలిచిపోయినా.. మెదడు పనిచేయడం మానేస్తుంది. రక్తహీనత వల్ల ముఖ్యంగా బీపీ పడిపోతుంది. అంటే రక్తప్రసరణ ప్రవాహ తీవ్రత తగ్గుతుంది. దీనివల్ల మెదడుకు ప్రాణవాయువు అందదు. దీంతో మెదడు చైతన్యహీనం అవుతుంది. ‘బ్రెయిన్‌డెడ్’ అంటే ఇదే. రక్త ప్రసరణ ఆగిపోతే మెదడు 3 నుంచి 5 నిమిషాలకు మించి పనిచేయదు. ఈ సమయం దాటితే నిర్జీవ స్థితికి చేరుకుంటుంది. రక్తహీనత వల్ల దెబ్బతినే రెండో ప్రధాన అవయవం గుండె. రక్తప్రసరణ ఆగిన 30 నుంచి 45 నిమిషాల వరకు మాత్రమే కనాకష్టంగా పనిచేస్తుంది. అంతకు మించితే శాశ్వతంగా ఆగిపోతుంది.
– డాక్టర్ కృష్ణ ప్రసాద్ హెమటాలజిస్ట్ట్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట, హైదరాబాద్
…?మహేశ్వర్‌రావు బండారి