Work From Home | కోవిడ్ తరువాత నుంచి చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. కానీ ఆఫీస్‌కు వెళ్లి పనిచేయడం కన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పి ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు అదే చేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని షరతులు విధిస్తున్నాయి. కానీ చాలా వరకు సంస్థలు మాత్రం తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఉద్యోగులకు ఇది మంచి అవకాశమే అయినప్పటికీ ఆరోగ్య పరంగా చూసుకుంటే కొన్ని రిస్క్‌లు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల రోజూ ఆఫీస్‌కు వెళ్లి వచ్చే ప్రయాణ భారం తప్పుతుంది. ట్రాఫిక్ జామ్లలో గంటల తరబడి చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు. కాలుష్యం బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ప్రయాణ సమయాన్ని ఆఫీస్ పని లేదా ఇతర పనులకు కేటాయించవచ్చు. దీంతో ఉద్యోగుల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఆఫీస్‌లో పనిచేయడంతో పోలిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల్లో ఒత్తిడి స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. తమకు నచ్చిన పని వేళల్లో ఉద్యోగం చేయవచ్చు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు సాధారణ పని గంటల కన్నా ఎక్కువ సేపు ఇంట్లో పని చేస్తున్నారు. అంటే వారు ఆఫీస్‌లో కన్నా ఇంట్లోనే అధిక శాతం కూర్చుని పనిచేస్తున్నారు. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
కూర్చుని పనిచేసే సమయం ఆఫీస్‌తో పోలిస్తే మరింత పెరుగుతుంది కనుక జీవనశైలి సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ మరింత పెరుగుతుందని అంటున్నారు. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్, అధికంగా బరువు పెరగడం, హైబీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే కండరాలు, ఎముకల సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ఆఫీసుల్లో పనిచేసేందుకు కావల్సిన అసలు సిసలైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో అలాంటి వాతావరణాన్ని సృష్టించలేరు. ముఖ్యంగా కూర్చునే విషయంలో చెయిర్ సౌకర్యవంతంగా ఉండదు. దీని వల్ల మెడ, భుజాల నొప్పి వస్తుంది. అధిక సమయం పాటు కంప్యూటర్ తెరను వీక్షిస్తారు కనుక కళ్లపై మరింత ప్రభావం పడుతుంది. కళ్లు పొడిగా మారి దురదలు పెడతాయి. కొందరికి ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సాధారణం కన్నా పని గంటలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇది నిద్రపై ప్రభావాన్ని చూపిస్తుంది. నిద్రలేమి వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. కానీ కొన్ని సూచనలు పాటిస్తే ఈ నష్టాలను కూడా దాదాపుగా తగ్గించుకోవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మీరు ఇంట్లో కూర్చునే చెయిర్తోపాటు కంప్యూటర్ ఉండే టేబుల్ ఆఫీస్ లాంటి అమరికను కలిగి ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కచ్చితంగా కుర్చీలోంచి లేచి 5 నిమిషాల పాటు విరామం తీసుకోవాలి. కంప్యూటర్ ఎదుట కూర్చునే సమయంలో మీ భంగిమ సరిగ్గా ఉండాలి. నీళ్లను అధికంగా తాగాలి. రోజూ యోగా, మెడిటేషన్ చేయాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. టైముకు భోజనం చేయాలి. మీరు ఇంట్లో పని చేసే చోట తగినంత గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఈ సూచనలు పాటిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.