Womens Health | మహిళలు హార్మోన్ల సమస్య కారణంగా తరచూ అనేక అనారోగ్యాలను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ కారణంగా వారు అనేక ఇబ్బందులు పడుతుంటారు. యుక్త వయస్సు నుంచి మెనోపాజ్ దశ వరకు అనేక సందర్భాల్లో వారికి హార్మోన్ల పరంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. నెలసరి సమయంలో కొన్ని సార్లు తీవ్ర రక్త స్రావం అవుతుంది. ప్రెగ్నెన్సీ కొందరికి ఆలస్యంగా వస్తుంది లేదా అసలు రాదు. జీర్ణ సమస్యలు, డయాబెటిస్ వస్తుంటాయి. ఇలా మహిళలు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే వారు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు వంటింట్లో ఉండే మసాలా దినుసులు ఎంతగానో దోహదపడతాయి. వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే హార్మోన్ల సమస్యలు ఉండవని, అలాగే రోగాల బారిన పడకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మహిళలు ఈ మసాలా దినుసులను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ప్రతి వంట ఇంట్లోనూ ధనియాలు కచ్చితంగా ఉంటాయి. వీటిల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితోపాటు వాపులను తగ్గిస్తాయి. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ధనియాలు ఎంతో పనిచేస్తాయి. అందువల్ల మహిళలు వీటిని రోజూ ఏదో ఒక రకంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ధనియాలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను ఉదయాన్నే పరగడుపునే తాగవచ్చు. ఈ నీళ్లను తాగితే వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ క్రియ సరిగ్గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. ధనియాలను రోజూ చేసుకునే వంటల్లోనూ వేసుకోవచ్చు.
వాము గింజల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. నెలసరి సమయంలో మహిళలకు వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తస్రావం జరగకుండా చూసుకోవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. వాము గింజలను నేరుగా తినవచ్చు. లేదా నీటిలో మరిగించి ఆ నీళ్లను పరగడుపునే తాగవచ్చు. రోజూ చేసే వంటల్లోనూ వాము వేసి తినవచ్చు. మహిళలు తప్పనిసరిగా వామును రోజూ తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. మహిళల ఆరోగ్యానికి సోంపు గింజలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తింటుండాలి. దీని వల్ల హార్మోన్లు సమతుల్యం అవుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. సోంపు గింజలతో టీ తయారు చేసి కూడా తాగవచ్చు.
పసుపుకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. దీన్ని రోజూ వంటల్లో కూడా వాడుతుంటారు. మహిళలకు పసుపు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తాయి. పసుపును రోజూ పాలలో కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. అలాగే మహిళల ఆరోగ్యానికి దాల్చిన చెక్క కూడా ఎంతగానో పనిచేస్తుంది. దాల్చిన చెక్కను వేసి మరిగించిన నీళ్లను రోజూ తాగుతుండాలి. దీంతో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. ఇలా పలు రకాల మసాలా దినుసులను తీసుకోవడం వల్ల మహిళలు తమకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.