Spinach | సాధారణంగా పురుషుల శరీరం కన్నా స్త్రీల శరీరంలోనే అనేక మార్పులు వస్తుంటాయి. వయస్సు మీద పడే కొద్దీ ఈ మార్పులు ఎక్కువవుతుంటాయి. కనుక వారు ఆరోగ్యం పట్ల అమితమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో ఏర్పడే మార్పులకు తగినట్లుగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్త్రీ శరీరంలో హార్మోన్ల పరంగానే కాకుండా శారీరక పరంగా కూడా పలు మార్పులు వస్తుంటాయి. అయితే ఈ మార్పులకు అనుగుణంగా శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు గాను పలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో పాలకూర ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. మహిళలు పాలకూరను తరచూ తీసుకోవాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
మహిళలకు నెలసరి సమయంలోనే కాకుండా పిల్లలకు జన్మ ఇచ్చినప్పుడు రక్తం ఎక్కువగా అవసరం అవుతుంది. తగినంత ఐరన్ లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అయితే పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది కనుక ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. అందుకు గాను ఆయా సమయాల్లో మహిళలు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరం నుంచి పోయే రక్తాన్ని భర్తీ చేయవచ్చు. సాధారణంగా 100 గ్రాముల పాలకూరను తింటే 2.7 మిల్లీగ్రాముల మేర ఐరన్‌ను పొందవచ్చు. దీంతో రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.
గర్భంతో ఉన్న మహిళలకు ఫోలేట్ అనేక పోషక పదార్థం ఎక్కువగా అవసరం అవుతుంది. ఇది బిడ్డ ఎదుగులకు ఎంతగానో అవసరం. పుట్టుకతో పిల్లలకు లోపాలు రాకుండా ఉండేందుకు గాను ఫోలేట్ ఉండే ఆహారాలను తింటుండాలి. డాక్టర్లు సాధారణంగా గర్భిణీలకు ఫోలేట్ ఉండే ట్యాబ్లెట్లను ఇస్తారు. వాటితోపాటు పాలకూరను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో 100 గ్రాముల పాలకూరను తినడం వల్ల సుమారుగా 165 మైక్రోగ్రాముల మేర ఫోలేట్ లభిస్తుంది. ఇది తల్లికి, బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది. వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పాలకూరలో క్యాల్షియం కూడా సమృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాముల పాలకూరను తింటే 99 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. ఇది స్త్రీల ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో వారికి ఆస్టియో పోరోసిస్, ఆర్థరైటిస్ వంటి ఎముకలు సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే కండరాల పనితీరు మెరుగు పడుతుంది. శారీరకంగా ఉండే నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. పాలకూరలో మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. 100 గ్రాముల పాలకూర ద్వారా 79 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. ఇది స్త్రీల కండరాల పనితీరుకు ఎంతగానో అవసరం అవుతుంది. దీంతోపాటు బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి, బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
పాలకూరలో విటమిన్ కె ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్తస్రావం ముప్పు మహిళలకు తప్పుతుంది. పాలకూరలో 100 గ్రాములకు గాను 482.9 మైక్రోగ్రాముల మేర విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలను సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా పాలకూరతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కనుక మహిళలు తప్పకుండా దీన్ని తరచూ తీసుకోవాలి.