Unwanted Hair | అవాంఛిత రోమాల సమస్యతో చాలా మంది మహిళలు బాధపడుతుంటారు. ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కడ ఉన్నా కూడా అంద విహీనంగా కనిపిస్తారని ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. అందులో భాగంగానే అన్వాంటెడ్ హెయిర్‌ను తొలగించుకోవడానికి ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలను పాటిస్తుంటారు. అయితే ఇందుకు అంత శ్రమించాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చని బ్యూటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి ఇంటి చిట్కాలను పాటిస్తే అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చని వారు అంటున్నారు. ఇందుకు గాను ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
2 టేబుల్ స్పూన్ల చక్కెర, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 8 టేబుల్ స్పూన్ల నీళ్లను కలిపి ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి సన్నని మంటపై వేడి చేయాలి. కొంత సేపటికి చక్కెర పూర్తిగా కరిగిపోతుంది. జెల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇది కాస్త వేడిగా ఉండగానే అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. అనంతరం దానిపై ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఉంచాలి. కాస్త ఆరాక వెంటనే వస్త్రాన్ని లాగాలి. దీంతో అవాంఛిత రోమాలు ఊడిపోయి వచ్చేస్తాయి. తరువాత నీళ్లతో కడిగేసి మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే అవాంఛిత రోమాల సమస్య ఉండదు. అయితే ఈ చిట్కా కొందరికి పడకపోవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ చిట్కాను పాటించకపోవడమే మంచిది.
1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని బాగా కలిపి అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే అవాంఛిత రోమాలు రాలిపోతాయి. ఈ చిట్కా కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది. కానీ చక్కని ఫలితాలను ఇస్తుంది. పైగా ఎలాంటి నొప్పి, బాధ ఉండవు. అలాగే 1-2 టేబుల్ స్పూన్ల పసుపులో కాస్త పాలు లేదా పెరుగు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని సంబంధిత చోట్ల రాయాలి. పూర్తిగా తడి ఆరిపోయాక స్క్రబ్ చేస్తూ కడిగేయాలి. ఈ చిట్కా కూడా అవాంఛిత రోమాలను తొలగించడంలో అద్భుతంగానే పనిచేస్తుంది.
1 లేదా 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి పండు గుజ్జును తీసుకుని అందులో కాస్త పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని సంబంధిత చోట్ల రాయాలి. 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. వారంలో 2-3 సార్లు ఈ చిట్కాను పాటించాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది. 1 ఎగ్ వైట్‌ను తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ చక్కెర, అర టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాసి పూర్తిగా పొడిగా మారిన తరువాత స్క్రబ్ చేస్తూ కడిగేయాలి. ఇలా తరచూ చేస్తున్నా కూడా అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల శనగపిండిలో తగినంత నీళ్లు, రోజ్ వాటర్ వేసి కలిపి అందులోనే కాస్త పసుపును కూడా వేసి కలిపి మెత్తని పేస్ట్‌లా మార్చాలి. దీన్ని రాస్తున్నా కూడా అన్వాంటెడ్ హెయిర్ తొలగిపోతుంది. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే సమస్య తగ్గడంతోపాటు ముఖం అందంగా కూడా మారుతుంది.