ఎంతోకాలం ఎదురుచూసినప్పటికీ సంతానం కలగకపోవడం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దంపతులను నిరాశ నిస్పృహలకు లోనుచేస్తుంది. అయితే, ఇటీవలి కాలంలో స్త్రీలలో సంతాన సఫలతకు సంబంధించిన చికిత్సలు, సాంకేతికతల్లో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తున్నది. దీంతో సంతాన యోగానికి అవకాశాలు పెరుగుతున్నాయని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు.
గొనాడోట్రాఫిన్స్: కొంతమంది స్త్రీలలో అండాలు క్రమం తప్పకుండా విడుదల కావు. లేదంటే పూర్తిగా అభివృద్ధి చెందకుండానే విడుదల కావొచ్చు. ఇలాంటి వారికి గొనాడోట్రాఫిన్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరంలో కీలక గ్రంథి అయిన పీయూష గ్రంథిని గొనాడోట్రాఫిన్స్ ప్రేరేపిస్తే స్త్రీల అండం విడుదలయ్యే సమయాన్ని సరిచేయవచ్చు. దీంతో అండం పూర్తిగా పరిపక్వత చెందిన తర్వాతే విడుదలయ్యే అవకాశాలు మెరుగుపడతాయి.
లెట్రోజోల్: ఇక మెనోపాజ్ తర్వాత స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు లెట్రోజోల్ను ఉపయోగిస్తారు. ఈ లెట్రోజోల్ స్త్రీలలో తలెత్తే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోం కారణంగా సంతాన సఫలతకు నోచుకోని వారికి ఉపయోగకరంగా ఉండొచ్చు అంటున్నారు వైద్యులు. లెట్రోజోల్ కూడా పీయూష గ్రంథి మీద ప్రభావం చూపుతుంది.
క్లోమిడ్: అండాలు ఉత్పత్తి కాని మహిళల్లో క్లోమిడ్ కూడా పీయూష గ్రంథికి సహకరిస్తుంది. క్లోమిడ్తో చికిత్స చేసినప్పుడు అండాశయంలో ఉండే ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్) స్పందించడం మెరుగుపడుతుంది. దీంతో పిల్లలు పుట్టడానికి అవకాశాలు పెరుగుతాయి.
మూలకణ చికిత్స: స్త్రీలలో సంతాన సఫలతకు మూలకణాల (స్టెమ్‌సెల్స్) చికిత్స కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మూలకణాలను ఎముక మూలుగ, లేదంటే కొవ్వు కణజాలం నుంచి సేకరిస్తారు. ఇది టెస్ట్‌ట్యూబ్ (ఐవీఎఫ్) చికిత్సకు అనువుగా ఉంటుంది.

పీజీఎస్, పీజీడీ: ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ (పీజీఎస్), ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నొసిస్ (పీజీడీ) విధానాలు గర్భస్రావం ముప్పును తగ్గిస్తాయి. గర్భధారణ విజయవంతమయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏవైనా జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికీ పీజీఎస్, పీజీడీ చికిత్సలు వీలు కలిగిస్తాయి.
కృత్రిమ మేధ: కాగా, ఐవీఫ్ రంగంలో ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ) బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో గర్భధారణకు (ప్రెగ్నెన్సీ) సంబంధించి మామూలు కంటికి కనిపించని వివరాలను గుర్తించవచ్చు. అవసరానికి అనుగుణంగా చికిత్స చేయవచ్చు.
టైమ్ లాప్సింగ్ ఇమేజింగ్ (టీఎల్ఐ): టైమ్ లాప్సింగ్ ఇమేజింగ్, కృత్రిమ మేధలను కలపడం ద్వారా గర్భధారణలో కీలకమైన బ్లాస్టోసిస్ట్ దశలో అండం ఫలదీకరణ చెందే క్రమంలో సహాయకారిగా ఉండే అవకాశం ఉంది. టైమ్ లాప్సింగ్ ఇమేజింగ్ ద్వారా పిండం అభివృద్ధి చెందే క్రమాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
క్రయోప్రిజర్వేషన్: ద్రవ నత్రజనిలో అతి శీతల పరిస్థితుల్లో నిల్వ ఉంచే క్రయోప్రిజర్వేషన్ పద్ధతి సాయంతో అండాలు, వీర్యకణాలు, పిండాలను భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
ఇవేకాకుండా సంతాన సఫలత విషయంలో అసిస్టెడ్ హ్యాచింగ్, రొబోటిక్ సాంకేతికత, నానోటెక్నాలజీ కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. మొత్తంమీద సంతానం కోసం వేచి చూస్తున్నవారికి ఇటీవలి కాలంలో వైద్య రంగంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ ఈ విషయంలో మరిన్ని సాంకేతికతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.