బిడ్డ కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్ రిపోర్టులన్నీ పిండం ఎదుగుదల బాగానే ఉందని వచ్చాయి. తొమ్మిది నెలలు దాటాక కూడా పిండం బాగానే ఉన్నట్టు స్కానింగ్ చేసి చెప్పారు. బేబీ పుట్టాక మూడు కిలోల బరువు ఉంది. పుట్టిన రోజు బాగానే ఉంది. రెండో రోజున బిడ్డకు ఫిట్స్ వచ్చాయి? అన్ని రకాల పరీక్షలు చేశారు. అన్నీ బాగానే ఉన్నాయన్నారు. మందులు ఇచ్చారు. రోజుల వయసు బిడ్డకు ఫిట్స్ వస్తాయా? భవిష్యత్‌లోనూ ఫిట్స్ వస్తాయా?
పెద్దవాళ్లకే కాదు రోజుల శిశువుకు కూడా ఫిట్స్ రావొచ్చు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోతే ఫిట్స్ వస్తాయి. మెదడుకు రక్తం అందకపోతే బిడ్డ పుట్టగానే ఏడవదు. మీ బిడ్డ విషయంలోఅలా జరిగిందో, లేదో చెప్పలేదు. శరీరంలో గ్లూకోజ్, కాల్షియం లవణాలు తగ్గినప్పుడు, జన్యుపరమైన కారణాల వల్ల, కొన్ని జీవక్రియలు సక్రమంగా జరగకపోవడం వల్ల, మెదడు నిర్మాణంలో లోపాల వల్ల శిశువులకు ఫిట్స్ వస్తాయి.
మీ బిడ్డకు ఏ కారణం చేత వచ్చిందో మీరు పంపిన వివరాల ప్రకారం చెప్పడం కష్టం. ఫిట్స్ రోగానికి ఇచ్చే మందుల వల్ల కంట్రోల్ అయి ఉంటాయి. బిడ్డ బాగానే ఉన్నదంటున్నారు. కాబట్టి ఆందోళన చెందకండి. అన్ని రకాల ఫిట్స్‌కి మందులు ఉన్నాయి. దానికి సరైన చికిత్స చేయాలంటే ఫిట్స్‌కి కారణం తెలియాలి. కాబట్టి పిల్లల వైద్యులకు చూపించండి. వీలుంటే నరాల వైద్యులను కూడా సంప్రదించవచ్చు.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్