Proteins | మన శరీరానికి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని రెండు రకాల పోషకాలు అవసరం అవుతాయి. ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులను స్థూల పోషకాలు అంటారు. ఎందుకంటే ఇవి మనకు రోజూ ఎక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. అలాగే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి మనకు రోజూ తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. అయితే స్థూల పోషకాల్లో చాలా మంది రోజూ పిండి పదార్థాలు, కొవ్వులను తింటుంటారు. కానీ ప్రోటీన్లను సరిగ్గా తీసుకోరు. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కనుక ప్రోటీన్లను రోజూ శరీరానికి తగినంత మోతాదులో లభించేలా చూసుకోవాలి. ఇక శరీర బరువును బట్టి మనం రోజూ ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ల వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
మన శరీరంలో కణాలు, కణజాలాల నిర్వహణ, మరమ్మత్తులకు ప్రోటీన్లు అవసరం అవుతాయి. కండరాలు, ఎముకలు, చర్మం, శిరోజాలకు చెందిన కణాలు, కణజాలాలకు ప్రోటీన్లు కావల్సి ఉంటుంది. ప్రోటీన్ల వల్ల ఉన్న కణాలకు మరమ్మత్తు జరుగుతుంది. కణజాలం వృద్ధి చెందుతుంది. కొత్త కణాలు నిర్మాణం అవుతాయి. ముఖ్యంగా కొల్లాజెన్, ఎలాస్టిన్, కెరాటిన్ వంటి పోషకాల ఉత్పత్తికి ప్రోటీన్లు అవసరం అవుతాయి. వీటి వల్ల చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మన శరీరంలో పలు ఎంజైమ్‌ల ఉత్పత్తికి, జీవ రసాయన చర్యలకు కూడా ప్రోటీన్లు కావాలి. ప్రోటీన్ల వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరంలో అంతర్గతంగా రక్తం గడ్డ కట్టకుండా చూసుకోవచ్చు. హార్మోన్ల ఉత్పత్తికి సైతం ప్రోటీన్లు కావల్సి ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థకు, శరీరంలో ద్రవాలు నియంత్రణలో ఉండేందుకు ప్రోటీన్లు సహాయం చేస్తాయి. కనుక ప్రోటీన్లు ఉండే ఆహారాలను మనం కచ్చితంగా రోజూ తినాల్సి ఉంటుంది.
ప్రోటీన్ల మనకు రెండు రకాలుగా లభిస్తాయి. వృక్ష సంబంధ లేదా జంతు సంబంధ పదార్థాలను తీసుకోవడం వల్ల ప్రోటీన్లను పొందవచ్చు. శాకాహారం తినేవారు వృక్ష సంబంధ పదార్థాలను తింటున్నా సరే ప్రోటీన్లు లభిస్తాయి. ఇక ప్రోటీన్లు మనకు ఎక్కువగా మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పాలు, పెరుగు, చీజ్, పనీర్, కోడిగుడ్లు, పప్పు దినుసులు, శనగలు, రాజ్మా, బొబ్బర్లు, పచ్చి బఠానీలు, సోయా టోఫు, సోయా పాలు, బాదంపప్పు, వాల్ నట్స్, పిస్తా, చియా విత్తనాలు, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, పీనట్ బటర్, కినోవా, ఓట్స్ వంటి ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ప్రోటీన్లను పొందవచ్చు. అలాగే ఖర్జూరాలు, బాదంపప్పు, అవిసె గింజల పొడి, చియా విత్తనాల పొడి, కొకొవా పొడి, కిస్మిస్లు, అల్లం రసం, యాలకుల పొడి, బాదంనూనె, దాల్చిన చెక్క పొడి, కొబ్బరి తురుము తదితర పదార్థాలను కలిపి ప్రోటీన్ లడ్డూలను తయారు చేసి రోజూ ఒకటి తినవచ్చు. ఇలా కూడా శరీరానికి రోజూ కావల్సిన ప్రోటీన్లను పొందవచ్చు.
ఇక ప్రోటీన్లను ఎవరైనా సరే తమ శరీర బరువును బట్టి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రతి 1 కిలో శరీర బరువుకు మన శరీరానికి 0.8 గ్రాముల ప్రోటీన్లను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి రోజుకు సుమారుగా 50*0.8=40 గ్రాముల ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఎవరికి వారు తమ శరీర బరువుకు అనుగుణంగా తమకు రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్లు కావాలో లెక్కించి ఆమేర ప్రోటీన్లను తినాల్సి ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు సమయాల్లోనూ తీసుకునే ఆహారాల్లో ప్రోటీన్లు మొత్తం కలిపి రోజువారి కోటాను భర్తీ చేయాలి. ఇలా చేస్తుంటే మన శరీరానికి ప్రోటీన్లు సరిగ్గా లభిస్తాయి. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.