Good Egg | కోడి గుడ్డులో ఎన్నో పోషకాలుంటాయి. వీటి ద్వారా మనకు ప్రొటీన్లు, కొలిన్ లభిస్తాయి. అందుకే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ కోడి గుడ్డు తినాలని పెద్దలు సూచిస్తుంటారు. గుడ్లు విస్తృతంగా వినియోగించే ఆహారం. ముఖ్యంగా అథ్లెట్లు, బాడీబిల్డర్లు ఎక్కువగా గుడ్లు తింటుంటారు. మార్కెట్లో ప్రధానంగా గోధుమ, తెలుపు అనే రెండు రకాల గుడ్లు అందుబాటులో ఉన్నాయి. తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఎక్కువ ప్రయోజనకరమైనవిగా చాలా మంది పరిగణిస్తుంటారు. అయినప్పటికీ, ఎక్కువ రుచిగా ఉంటాయని చాలా మంది తెల్ల గుడ్లను ఇష్టపడతారు. వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్.. ఈ రెండింటిలో ఏవి మనకు ఆరోగ్యాన్నిస్తాయో తెలుసుకుందాం.
ఒక గుడ్డు తింటే 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, 190 గ్రాముల కొలెస్ట్రాల్ మన శరీరానికి అందుతాయని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు. వీటిలో పలు విటమిన్లతోపాటు ఫాస్పరస్, అయోడిన్, ఐరన్, జింక్, సెలీనియం, ఫొలేట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి కూడా దొరుకుతాయి.
రంగులో తేడాకు కారణమేంటంటే..
కోడి గుడ్ల రంగు కోడి జాతిపై ఆధారపడి ఉంటుంది. కోళ్లు ఉత్పత్తి చేసే పిగ్మెంట్లు గుడ్డు పెంకుల రంగును నిర్ణయిస్తాయి. గోధుమ రంగు గుడ్లలోని ప్రాథమిక వర్ణద్రవ్యం ప్రోటోపోర్ఫిరిన్ IX. ఇది హేమ్ సమ్మేళనం నుంచి తయారవుతుంది. ఇది రక్తానికి ఎరుపు రంగును ఇవ్వడంలో సాయపడుతుంది. కోళ్ళ మధ్య జన్యుపరమైన తేడాల వల్ల ఒకే జాతి కోళ్ల మధ్య రంగు వ్యత్యాసం కూడా ఉంటుంది. అంతేకాకుండా, గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్లు కూడా వయసు పెరిగే కొద్దీ లేత రంగులో గుడ్లను ఉత్పత్తి చేస్తుంటాయి.
ఏవి మనకు ఆరోగ్యాన్నిస్తాయంటే..
బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లేదా బ్రౌన్ షుగర్.. వీటిని మనం బ్రౌన్‌ను ఆరోగ్యకరమైనగా భావించి ఎంపిక చేసుకుంటుంటాం. అయితే, గుడ్ల విషయానికి వచ్చే సరికి రంగు, పరిమాణం లేదా గ్రేడ్ కారణంగా పోషక వ్యత్యాసం ఎక్కువగా ఉండదు. గోధుమ రంగు గుడ్లు చాలా ఖరీదైనవని గమనించవచ్చు. ఎందుకంటే గోధుమ రంగు గుడ్లు పెట్టే కోడి పెద్దవిగా ఉండి ఎక్కువ ఆహారం తీసుకుంటుంటాయి. దాంతో అవి ఇచ్చే గుడ్ల ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే, గోధుమ రంగు గుడ్లు పెద్దవిగా ఉంటాయి. వాటి పచ్చసొన తెల్లటి వాటి కంటే ముదురు రంగులో ఉంటుంది.
చివరగా..
వైట్ ఎగ్, బ్రౌన్ ఎగ్.. రెండింటిలోనూ ఒకే విధమైన పోషక విలువలు ఉన్నందున వాటి రంగుతో సంబంధం లేకుండా ఎలాంటి గుడ్డునైనా తినవచ్చు. అయితే, పెద్ద మొత్తంలో గుడ్లు తినడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వెన్న, బర్గర్లు లేదా చీజ్ ఆమ్లెట్.. గుండె సమస్యలను కలిగిస్తుంది. డయాబెటిస్, క్యాన్సర్ లేదా ఏదైనా గుండె జబ్బు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.