Breakfast | మనం రోజూ ఉదయం వివిధ రకాల బ్రేక్ఫాస్ట్లను తింటుంటాం. కొందరు ఇడ్లీలను తింటే, ఇంకొందరు దోశ, ఇంకా కొందరు పూరీ, చపాతీ, ఉప్మా వంటి అల్పాహారాలను తింటుంటారు. ఇక ఉదయం అన్నం తినే వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం ఉదయం మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. దీంతో మనకు ఆ రోజుకు కావల్సిన పోషకాలు ఉదయం ఆహారం నుంచి లభించడమే కాదు, శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీంతో రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. నీరసం, అలసట రాకుండా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. ఉత్తేజంగా పనిచేస్తారు. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్ ఫాస్ట్లో ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం బ్రేక్ ఫాస్ట్లో సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాలను తింటే మంచిది. బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, రాగులు, జొన్నలు వంటి చిరు ధాన్యాలతో చేసిన టిఫిన్లు, పోహా, పప్పు దినుసులతో తయారు చేసే ఇడ్లీ లేదా దోశ వంటివి, కినోవా వంటి ఆహారాలను తింటే మంచిది. ఇవి శరీరానికి శక్తిని, పోషణను అందిస్తాయి. శరీరం రోజంతా యాక్టివ్గా ఉండేలా చూస్తాయి. అలాగే ఉదయం అల్పాహారంలో ప్రోటీన్లు ఉండేలా కూడా చూసుకోవాలి. కోడిగుడ్లు, పనీర్, మొలకలు, పప్పు దినుసులు, పెరుగు, బాదం, పిస్తా, జీడిపప్పు, చియా సీడ్స్, అవిసె గింజలు, పల్లీలు వంటివి తింటే ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాలను నిర్మించడమే కాదు, శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తాయి. నీరసం, అలసట రానివ్వవు.
అవకాడో, నట్స్, సీడ్స్, నెయ్యి, ఆరోగ్యవంతమైన నూనెలను కూడా ఉదయం తీసుకుంటే మంచిది. అలాగే అరటి పండ్లు, యాపిల్స్, బెర్రీలు, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లను మీరు తినే టిఫిన్లో చేర్చుకుని తింటే మంచిది. దీంతో పోషకాలను అమితంగా పొందవచ్చు. అలాగే క్యాల్షియం లభించేందుకు గాను ఉదయం పాలను తీసుకోవచ్చు. జంతు సంబంధ పాలు అంటే అలర్జీ ఉన్నవారు సోయా పాలు, బాదం పాలను తాగవచ్చు. ఇక బ్రేక్ ఫాస్ట్లో తీసుకోకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పేస్ట్రీలు, బేకరీ ఐటమ్స్, తీపి అధికంగా ఉండే పాన్ కేక్స్, వాఫెల్స్ వంటివి తినకూడదు.
ఉదయం టీ, కాఫీ తాగేవారు చక్కెర లేకుండా తాగితే మంచిది. లేదా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, లెమన్ టీ సేవించవచ్చు. వీటిల్లోనూ చక్కెర కలపకుండా తాగాలి. కావాలంటే కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. అలాగే ప్రాసెస్ చేయబడిన పండ్ల రసాలు, స్టోర్లలో కొనుగోలు చేసిన స్మూతీలు, చక్కెర ఎక్కువగా ఉండే పెరుగుకు సంబంధించిన ఆహారాలు, నూనె పదార్థాలు, వేపుళ్లు, రాత్రి మిగిలిన కూరలు, కొవ్వు ఆహారాలు, అన్నం వంటి వాటిని ఉదయం ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. ఇవన్నీ అనారోగ్యాలను కలగజేస్తాయి. వ్యాధులకు మూల కారణం అవుతాయి. కనుక ఉదయం మీరు తినే ఆహారం ఆరోగ్యవంతమైనదిగా, పోషకాలను, శక్తిని అందించేదిగా ఉండాలి. అప్పుడు మీరు యాక్టివ్గా ఉండడమే కాదు, ఎలాంటి రోగాలు రాకుండా సురక్షితంగా ఉంటారు. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.