చేతుల్లో, వేళ్లలో తరచూ నొప్పిగా ఉందా? ఇందుకు కారణం శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరగడం కావొచ్చు! అందుకే ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ ఎంతుందో చెక్ చేసుకోవడం మంచిది. అలాగే అందుకు కారణాలు కూడా తెలుసుకోవాలి. సాధారణంగా యూరిక్ యాసిడ్ రక్తంలో కరిగిపోయి, మూత్రపిండాల ద్వారా మూత్రం నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఎప్పుడైతే దీని స్థాయులు పెరుగుతాయో, అది పూర్తిగా బయటికి వెళ్లకుండా హైపర్ యూరిసేమియా అనే పరిస్థితికి దారితీస్తుంది. అప్పుడే కీళ్లల్లో సమస్య మొదలవుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయులు పెరిగినప్పుడు, మోనోసోడియం క్రిస్టల్స్ అనేవి ఏర్పడతాయి.
ఇవి కీళ్లల్లో పేరుకుపోయి వాపు, నొప్పి, ఇన్ఫ్లమేషన్ లాంటివి వస్తాయి. ఆ సమస్యనే గౌట్ అంటారు. ఇది ఎక్కువగా చేతి వేళ్లలోని కీళ్లు, కాలి బొటనవేలు, మణికట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆకస్మికంగా భరించలేని నొప్పి, మంట, కీళ్ల దగ్గర ఎరుపెక్కి వాపు రావడం, కీళ్లు గట్టిపడి కదల్చలేకపోవడం తదితర లక్షణాలు ఉంటే.. గౌట్ సమస్యగా గమనించాలి. దీని పరిష్కారానికి ఈ సూత్రాలు పాటించడం అవసరం.