వానాకాలం, శీతాకాలంలో సాధారణంగా ఫ్లూ విజృంభిస్తుంది. అయితే ఇది అందరిలోనూ తీవ్రమైన లక్షణాలతో ఉండదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల ఫ్లూ ఇన్ఫెక్షన్ని సాధారణ జలుబుగా చాలామంది భావిస్తారు. కామన్కోల్డ్, ఫ్లూ ఒకటి కాదు. కామన్ కోల్డ్ రైనో వైరస్, నాన్ కరోనా వైరస్ల వల్ల వస్తుంది. ఫ్లూ మాత్రం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుంది. ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకితే గొంతు, ముక్కు, ఊపిరితిత్తులని ప్రభావితం చేస్తుంది. అధిక జ్వరం, చలి, వణుకు, గొంతు నొప్పి, ఆగకుండా దగ్గు, తలనొప్పి, బాడీ పెయిన్స్, వాంతులు వస్తాయి. పక్షుల నుంచి సోకే ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ని బర్డ్ ఫ్లూ అని పిలుస్తారు. హెచ్1ఎన్1, స్వైన్ ఫ్లూ తో పిలిచే ఇన్ఫెక్షన్లు కూడా ఇన్‌ఫ్లూయెంజా ఇన్ఫెక్షన్లే.
వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్లూ రాదు. వచ్చినా దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. ఆరు నెలలు పైబడిన శిశువు నుంచి అరవై అయిదు సంవత్సరాల వయసు పెద్దల వరకు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఏడాదికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకునేప్పుడు ఆ ఏడాదిలో ఏ రకమైన ఫ్లూ వైరస్ విజృంభిస్తుందో అదే వైరస్‌కి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకుంటే మేలు. పాతికేండ్లు పైబడిన పెద్దవాళ్లు, అలర్జీ, గుండె, కిడ్నీ, లివర్ వ్యాధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు వైద్యుల సలహాతోనే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.
ఫ్లూ ఇన్ఫెక్షన్తో ఉన్నవాళ్లు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు.. తుంపర్ల ద్వారా ఫ్లూ వైరస్లు వ్యాపిస్తాయి. ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు కనిపించడానికి రెండు మూడు రోజుల ముందు నుంచే వైరస్ ఇతరులకు సోకుతుంది. ఇంట్లో ఒకరికి ఫ్లూ వస్తే మరొకరికి సోకవచ్చు. ముఖ్యంగా పిల్లలకు త్వరగా అంటుతుంది. ఇంట్లో ఒకరికి ఫ్లూ వచ్చినప్పుడు మిగతా పిల్లలకు రాకుండా వ్యాక్సిన్ తీసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న రెండు, మూడు వారాల తర్వాత ఫ్లూ వ్యాధి నిరోధకత పెరుగుతుంది. మన దేశంలో ఆగస్టు-నవంబర్ నెలల మధ్య ఫ్లూ విజృంభిస్తుంది. వ్యాక్సిన్ మూడు, నాలుగు నెలలు ప్రభావం చూపుతుంది. కాబట్టి జూలై నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. మరీ ముందుగా తీసుకున్నా ఆ వ్యాక్సిన్ వల్ల కలిగే రోగ నిరోధకత తగ్గిపోతుంది. ఫ్లూ సీజన్లో సమర్థంగా రక్షణ ఇవ్వలేదు.
– డాక్టర్ అనుపమ వై.
సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్