Brown Rice | ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మందికి శ్రద్ధ పెరిగింది. అందుకనే అధిక శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా రోజూ తినే తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తినడం ఎక్కువైంది. ఒకప్పుడు మన పూర్వీకులు, పెద్దలు బ్రౌన్ రైస్‌నే అధికంగా తినేవారు. అందుకనే వారు అన్నేళ్ల పాటు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించారు. కానీ ఇప్పుడు చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. ఇలా రోగాల బారిన పడకుండా ఉండాలంటే అందుకు బ్రౌన్ రైస్ ఎంతగానో దోహదం చేస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. తెల్ల అన్నం తినడం కన్నా కూడా బ్రౌన్ రైస్‌ను తింటేనే అధికంగా పోషకాలు లభిస్తాయి. ఇవి మనకు రోగాలు రాకుండా రక్షిస్తాయి. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
బ్రౌన్ రైస్‌లో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ బ్రౌన్ రైస్‌ను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఉండడం, తక్కువ గ్లైసీమిక ఇండెక్స్ విలువ ఉండడం కారణంగా ఈ రైస్‌ను తింటే పిండి పదార్థాలు నెమ్మదిగా రక్తంలో గ్లూకోజ్‌గా మారుతాయి. దీంతో ఆహారం తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరగవు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారు తెల్ల అన్నంకు బదులుగా బ్రౌన్ రైస్‌ను తింటుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. బ్రౌన్ రైస్‌ను తింటే అందులో ఉండే మెగ్నిషియం, సెలీనియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. బీపీని నియంత్రణలో ఉంచుతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
సాధారణ వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్‌లో విటమిన్లు, మినరల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఈ రైస్‌లో అధికంగా ఉండే మెగ్నిషియం మన శరీరంలో 300కు పైగా జీవ రసాయనిక క్రియలను నిర్వహిస్తుంది. ఇది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాలను ప్రశాంతంగా మారేలా చేస్తుంది. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో ఉండే సెలీనియం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక థైరాయిడ్ ఉన్నవారు బ్రౌన్ రైస్‌ను రోజూ తింటుంటే మేలు జరుగుతుంది. బ్రౌన్ రైస్‌లో అనేక రకాల బి విటమిన్లు సైతం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా ఉండేలా చేస్తాయి.
బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం చాలా మందికి తెలుసు. కానీ ఈ రైస్‌ను ఎంత మోతాదులో తినాలి, రోజులో ఏ సమయంలో తినాలి.. అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే.. బ్రౌన్ రైస్‌ను మధ్యాహ్నం లంచ్ సమయంలో తింటే మంచిది. ఈ రైస్‌లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. కనుక ఈ రైస్‌ను రాత్రి పూట తింటే త్వరగా జీర్ణం కాదు. జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రౌన్ రైస్‌ను మధ్యాహ్నం తినాలి. ఉదయం 1 నుంచి 2 గంటలపాటు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని అనుకునేవారు ఆ పని చేయడానికి 1 గంట ముందు బ్రౌన్ రైస్ తినవచ్చు. దీంతో శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. నీరసం, అలసట ఉండవు. ఇలా బ్రౌన్ రైస్‌ను తింటుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.