Onions | ఉల్లిపాయలను మనం ఎంతో పూర్వకాలం నుంచే వంటల్లో ఉపయోగిస్తున్నాం. వీటిని తరిగి కూరల్లో వేస్తుంటారు. లేదా నేరుగా పచ్చిగానే తింటారు. కొందరు పచ్చడి పెట్టుకుంటారు. కొందరు ఉడకబెట్టి తింటారు. ఉల్లిపాయలను చాలా మంది రకరకాలుగా తింటుంటారు. అసలు ఉల్లిపాయలు లేనిదే ఏ కూర పూర్తి కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉల్లిపాయల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో క్వర్సెటిన్, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఉల్లిపాయలను సరైన సమయంలో తింటేనే మనం వాటితో పూర్తి స్థాయి ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలను రోజులో సరైన టైమ్‌లో తింటేనే మనకు అనేక లాభాలు ఉంటాయని అంటున్నారు. ఇక ఉల్లిపాయలను అసలు ఎప్పుడు తింటే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి ఉల్లిపాయలను ఉదయం పరగడుపున తింటే ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయలను పరగడుపునే తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మన శరీరంలో పలు ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం రోజంతా శోషించుకుంటుంది.
ఉల్లిపాయలను ఉదయం తినే సలాడ్స్‌లో చేర్చుకోవచ్చు. లేదా స్మూతీల్లో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ జ్యూస్‌ను గోరు వెచ్చని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఒక టీస్పూన్ ఉల్లిపాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారు ఈ విధంగా తాగితే మేలు జరుగుతుంది. ఉల్లిపాయలను లంచ్ లేదా డిన్నర్లో తీసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. కానీ ఉదయం పరగడుపున వీటిని తింటే ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఉల్లిపాయల్లో ప్రీ బయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఉల్లిపాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఏవైనా పప్పు దినుసులు తినేటప్పుడు కూడా ఉల్లిపాయలను వాటితో కలిపి తినవచ్చు. ఉల్లిపాయల్లో ఉండే సహజసిద్ధమైన ఎంజైమ్‌లు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడతాయి. ఉల్లిపాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఉల్లిపాయలను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఉల్లిపాయల్లో క్రోమియం అధికంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. దీంతో డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా ఉల్లిపాయలను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.