Water Drinking | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళకు భోజనం చేయడంతోపాటు ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజూ వ్యాయామం చేయాలి. కచ్చితంగా తగినన్ని గంటలపాటు నిద్రించాలి. అలాగే రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాల్సి ఉంటుంది. సాధారణంగా మనం చలికాలంలో తక్కువ నీళ్లను తాగుతాం. ఎండకాలంలో శరీరం వేడిగా మారుతుంది కనుక నీళ్లను ఎక్కువగా తాగుతాం. అయితే వాస్తవానికి రోజులో ఏ సమయంలో నీళ్లను ఎక్కువగా తాగాలి, ఎప్పుడు తక్కువగా తాగాలి.. అసలు ఏ సమయంలో నీళ్లను తాగితే మంచిది.. అన్న వివరాలను ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలను తెలుసుకుందాం.
రాత్రి నుంచి ఉదయం వరకు శరీరానికి నీరు లభించదు. ఎందుకంటే మనం నిద్రిస్తూ ఉంటాం. కనుక శరీరానికి పెద్ద మొత్తంలో నీరు ఉదయం అవసరం అవుతుంది. కాబట్టి నిద్రలేచిన వెంటనే 1 లీటర్ నీళ్లను తాగాలని చెబుతున్నారు. 1 లీటర్ నీళ్లను ఒకేసారి తాగలేకపోతే కాస్త విరామం ఇచ్చి తాగవచ్చు. దీంతో మనకు రోజుకు కావల్సిన నీటిలో దాదాపుగా 30 శాతం నీరు ఉదయమే లభిస్తుంది. అయితే ఉదయం గోరు వెచ్చని నీళ్లను తాగితే ఇంకా మంచిది. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ఉదయం పరగడుపునే గోరు వెచ్చని నీటిని తాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రంగా మారుతాయి.
ఉదయం పరగడుపునే గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. కొవ్వు కరిగిపోతుంది. అథిక బరువు తగ్గుతారు. ఉదయం నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలు ఉండవు. రోజంతా మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు నీళ్లను తాగాలి. ఆ సమయంలో ఒక గ్లాస్ నీళ్లను తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
భోజనం చేసే సమయంలో కాకుండా భోజనం చేసిన అనంతరం 30 నిమిషాలు ఆగి నీళ్లను తాగాలి. ఇలా తాగితే మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియకు నీళ్లు దోహదం చేస్తాయి. అలాగే వ్యాయామం చేసేముందు ఒక గ్లాస్ నీటిని కచ్చితంగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడతారు. రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో గుండెపై భారం పడుతుంది. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం లేదా పనితీరులో మార్పులు వస్తాయి. దీని ప్రభావం గుండెపై పడి హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. కాబట్టి వ్యాయామానికి ముందు నీళ్లను తాగడం తప్పనిసరి. అలాగే రాత్రి పూట నిద్రకు ముందు కూడా ఒక గ్లాస్ నీళ్లను తాగాలి. ఇలా చేస్తే రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా పలు సమయాల్లో కచ్చితంగా నీళ్లను తాగితే ఆరోగ్యంగా ఉంటారు.