Bath | శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మనం రోజూ స్నానం చేస్తూ ఉంటాం. రోజువారి పరిశుభ్రతలో స్నానం చేయడమనేది ఒక కీలకమైన భాగమని చెప్పవచ్చు. చాలా మంది వారి రోజును స్నానం చేయడంతోనే ప్రారంభిస్తూ ఉంటారు. అలాగే మరికొందరు రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు స్నానం చేస్తారు. కొందరు వారి వీలును బట్టి రోజులో ఏదో ఒక సమయంలో స్నానం చేస్తూ ఉంటారు. కానీ మనం స్నానం చేసే సమయం మన శరీరాన్ని భిన్నంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
2022 యూఎస్ లో జరిపిన సర్వే ప్రకారం 42 శాతం మంది ఉదయం పూట స్నానం చేయడానికి అలాగే 25 శాతం మంది పడుకునే ముందు స్నానం చేయడానికి ఇష్టపడతారని తేలింది. ఇక చర్మ వైద్యులు చెబుతున్న ప్రకారం రాత్రి స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, ధూళి తొలిగిపోవడంతో పాటు ఇది మంచి నిద్రకు కూడా దారి తీస్తుంది. రాత్రి స్నానం చేయడం వల్ల నిద్రించే సమయంలో చర్మంపై చెమట, బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉంటుంది. కానీ ఉదయం పూట స్నానం చేయడం వల్లనే మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఉదయం స్నానం చేయడం వల్ల రాత్రిపూట చర్మంపై పేరుకుపోయిన సూక్ష్మజీవులు తొలగిపోతాయి. దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా తగ్గుతుంది. దీంతో శరీరం తాజాగా దుర్వాసన లేకుండా ఉంటుంది. ఉదయం చేసే స్నానం చర్మ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే మనం చేసే పనులు, మన వ్యక్తిగత ప్రాధాన్యతలు మనం చేసే సమయాన్ని నిర్దారిస్తాయి. కనుక స్నానం ఏ సమయంలో చేసినప్పటికి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం.
ఇక దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా, దురద వంటి సమస్యలకు కారణమయ్యే సూక్ష్మజీవులు చర్మంపై పేరుకుపోకుండా ఉండాలంటే మనం నిద్రించే పరుపులను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలని చర్మ వైద్యులు చెబుతున్నారు. కనీసం వారానికి ఒకసారైనా బెడ్ షీట్లను, దిండు కవర్లను మారుస్తూ ఉండాలని ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని వారు తెలియజేస్తున్నారు.