Ketogenic Diet | ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం చేస్తే కొందరు డైట్ పాటిస్తారు. ఇంకొందరు రోజూ పలు ఆహారాలను లేదా పానీయాలను తీసుకుంటుంటారు. కొందరు డైటిషియన్ లేదా న్యూట్రిషియన్ సలహా మేరకు జీవనశైలిని మార్చుకుంటారు. అయితే ఇవన్నీ ఉపయోగకరమైనవే. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండేందుకు డైట్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. సరైన డైట్‌ను పాటిస్తేనే మనకు పోషకాలు సరిగ్గా లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. రోగాల నుంచి బయట పడవచ్చు. అయితే చాలా మంది కీటో డైట్ గురించి వినే ఉంటారు. కానీ అసలు కీటో డైట్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి..? దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అన్న విషయాలపై చాలా మందికి సరైన అవగాహన లేదు. ఈ క్రమంలోనే వైద్యులు, పోషకాహార నిపుణులు కీటో డైట్ గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరం పనిచేసేందుకు గ్లూకోజ్ అవసరం అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. గ్లూకోజ్ మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. అయితే గ్లూకోజ్ తగినంతగా లేకపోతే మన శరీరం కొవ్వును ఇంధనంగా వాడుకుంటుంది. కానీ ఈ సమయంలో విపరీతంగా ఆకలి అవుతుంది. దీంతో మనం ఆహారం తీసుకుంటాం. తద్వారా అందులో ఉండే పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారుతాయి. తిరిగి యథావిధిగా మన శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది. అయితే శరీరం కేవలం కొవ్వును మాత్రమే ఇంధనంగా వాడుకునేలా చేసే ప్రక్రియనే కీటోజెనిక్ డైట్ అంటారు. ఈ డైట్లో భాగంగా మనం తినే ఆహారాల వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకూడదు. కానీ మనం ఆహారం తినాల్సి ఉంటుంది. వాటి వల్ల గ్లూకోజ్ పెరగకుండా చూడాలి. దీంతో శరీరం కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వు నిల్వలు ఖర్చవుతాయి. ఇది మనకు మేలు చేస్తుంది. ఇది కీటో డైట్లో ముఖ్య భాగం అని చెప్పవచ్చు. ఇలా కీటోడైట్‌ను పాటించాల్సి ఉంటుంది.
అయితే కీటోడైట్‌ను పాటించాలంటే మన శరీరానికి గ్లూకోజ్ లభించకూడదు. కనుక కొవ్వులు లేదా ప్రోటీన్లు ఉండే ఆహారాలనే తినాల్సి ఉంటుంది. అప్పుడే కీటోడైట్ పాటించినట్లు అవుతుంది. కీటోడైట్‌లో భాగంగా బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, పల్లీలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలు, మాంసాహారం, కోడిగుడ్లు తినాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. వేపుళ్లు, చిరుతిండి, ఇతర నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్ కీటోడైట్ కిందకు రావు. కీటోడైట్‌లో భాగంగా రోజుకు 50 గ్రాముల కన్నా తక్కువ మోతాదులో పిండి పదార్థాలను తీసుకోవాలి. మిగిలిన క్యాలరీలన్నీ మనకు కొవ్వులు లేదా ప్రోటీన్ల ద్వారానే లభించాలి. అప్పుడే కీటోడైట్‌ను పాటించినట్లు అవుతుంది. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కోడిగుడ్లు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, కొబ్బరినూనె, వెన్న, నెయ్యి, చీజ్, మీగడ, ఆలివ్ ఆయిల్ వంటివన్నీ కీటోడైట్ కిందకు వస్తాయి.
కీటోడైట్‌లో ఉన్నవారు గోధుమలు, మొక్కజొన్న, బియ్యం, తృణ ధాన్యాలను తినకూడదు. తేనె, చక్కెర తీసుకోకూడదు. యాపిల్, అరటి పండ్లును తినకూడదు. ఆలుగడ్డలు, క్యారెట్లను కూడా తినకూడదు. ఇలా కీటోడైట్ లో భాగంగా ఏయే ఆహారాలను తినాలి, వేటిని తినకూడదు అనే వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తరువాతే ఈ డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే డైట్‌ను పాటించి కూడా ప్రయోజనం ఉండదు. ఇక కీటోడైట్‌ను కనీసం 21 రోజుల పాటు అయినా పాటించాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది. కీటోడైట్‌ను పాటిస్తే అధిక బరువు తగ్గుతారు. నడుం చుట్టు కొలత గణనీయంగా తగ్గుతుంది.డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్, గుండె జబ్బులు రావు. మహిళలకు ఉండే పీసీవోఎస్ అనే సమస్య తగ్గిపోతుంది. అయితే కీటోడైట్ అందరికీ పనిచేయదు. కనుక డాక్టర్ సూచన మేరకు దీన్ని పాటించాల్సి ఉంటుంది. లేదంటే కిడ్నీలపై భారం పడి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక కీటోడైట్‌ను పాటించే వారు కచ్చితంగా డాక్టర్ సలహా పాటించాలి.