మా పాప వయసు ఆరు నెలలు. తల వెనుకాల, ఒకవైపు ఫ్లాట్గా ఉంది. చూస్తేనే సరిగా లేదని అర్థమవుతున్నది. పిడియాట్రీషియన్కి చూపించాం. దానంతట అదే తగ్గిపోతుందని మొదట అన్నారు. తర్వాత హెల్మెట్ థెరపీ అవసరమంటున్నారు. ఇంత చిన్నపాపకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుందా? ఈ హెల్మెట్ థెరపీ పనిచేస్తుందా? మా బిడ్డ తల ఆకారం ఫ్లాట్గా ఎందుకు ఉంది? వివరించగలరు.
మీ పాప వయసు ఆరు నెలలు అంటున్నారు. తల ఒకవైపు ఫ్లాట్గా ఉందంటున్నారు. మిగతా ఏ లక్షణాలు లేవేమో అనుకుంటున్నాను. బహుశా ఇది ‘పొజిషనల్ ప్లేజియోకెఫలి’ అయి ఉండొచ్చు. బిడ్డను మొదటి ఆరు నెలలు వెల్లకిలా పడుకోబెడతాం. ఆ కారణంగా తల వెనుక భాగం ఫ్లాట్గా అయిపోయి ఉంటుంది. బిడ్డ తల ఒకవైపే తిరిగి ఉండటం ఇంకో కారణం. ఇది హానికరమైన సమస్య కాదు. బిడ్డ కూర్చోవడం, నిల్చోవడం మొదలైన తర్వాత ఆ ఆకారం మారిపోయి, సాధారణ రూపం వస్తుంది. కాకపోతే ఇది పడుకున్న కారణంగానే వచ్చిందా? లేక పుర్రె నిర్మాణంలో ఏదైనా లోపం ఉందా? అనేది తెలియాలి.
పుర్రె నిర్మాణంలో అనేక ఎముకలు (సూచర్స్) అమరి ఉంటాయి. ఈ ఎముకల అమరిక సరిగా లేకుంటే తల ఆకారం సరిగా ఉండదు. ఈ సమస్యను ‘క్రేనియోసినాస్టోసిస్’ అంటారు. పుర్రె నిర్మాణంలోని (సూచర్స్) మూసుకుపోయి ఉన్నాయా? లేదా? తెలుసుకోవాలి. మీ బిడ్డకు ఈ సమస్య ఉందేమోనని పిల్లల వైద్యుడు పరీక్షించే ఉంటారు. ఒకవేళ మీ పాప సమస్య క్రేనియోసినాస్టోసిస్ అయితే తలపై చేయిపెట్టి నిమిరితే మధ్యలో గట్టిగా, ఉబ్బెత్తుగా చేతికి తగులుతుంది. కళ్లు కొంచెం ముందుకు వచ్చినట్టుగా ఉంటాయి. అలాగే మీ పాపకు మాడులో సాఫ్ట్ స్పాట్ ఉందో, మూసుకుపోయి ఉందో పరీక్షించాలి.
మీరు చెప్పే వివరాల ప్రకారం పొజిషనల్ ప్లేజియోకెఫలి సమస్యే ఉండి ఉంటుంది. బిడ్డకు ఆరు నెలలు అంటున్నారు. కాబట్టి ఎక్కువ సమయం పొట్ట మీద పడుకోబెట్టి చూస్తూ ఉండాలి. బిడ్డను ఎక్కువ సమయం కారు సీట్లో, బౌన్సర్లలో కూర్చోబెట్టకండి. ఆర్థోపెడిక్ హెల్మెట్ థెరపీలో ప్రత్యేకమైన హెల్మెట్ తయారు చేసి వాడతారు. దీని వల్ల సమస్య పోతుంది. కానీ, సమస్య ఏ స్థాయిలో ఉందో వైద్యులే నిర్ణయిస్తారు. పిల్లల డాక్టర్ని, న్యూరో సర్జన్ని కలిస్తే మీకు సరైన సలహా ఇస్తారు.