Vitamin D Deficiency | మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక విధులు నిర్వహిస్తుంది. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ డి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును సక్రమంగా ఉంచడంలోనూ విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విటమిన్ డి లోపం బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. విటమిన్ డి ని మన శరీరం సూర్య రశ్మి ద్వారా తయారు చేసుకుంటుంది. కనుక రోజూ శరీరానికి తగినంత సూర్య రశ్మి తగిలేలా చూడాలి. లేదంటే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి లోపిస్తే మన శరీరం పలు లక్షణాలను తెలియజేస్తుంది.
శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోతే లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల శరీరం వ్యాధుల బారిన పడుతుంది. అందుకని శరీరంలో తగినంత విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి స్థాయిలు 20 ng/mL కన్నా తక్కువగా ఉంటే విటమిన్ డి లోపంగా డాక్టర్లు నిర్దారిస్తారు. విటమిన్ డి వల్ల మన శరీరం క్యాల్షియంను శోషించుకుంటుంది. మనం తినే ఆహారాల్లో ఉండే క్యాల్షియం మన శరీరానికి కావాలంటే అందుకు విటమిన్ డి ఎంతగానో అవసరం అవుతుంది. మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్‌ను శరీరం శోషించుకుంటుంది. ఇందుకు విటమిన్ డి సహాయం చేస్తుంది. అయితే విటమిన్ డి తగినంతగా లేకపోతే శరీరం క్యాల్షియంను శోషించుకోదు. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారుతాయి.
విటమిన్ డి లోపం అనేది పరోక్షంగా ఎముకల బలహీనతకు కారణమవుతుంది. దీంతోపాటు కండరాల పనితీరుకు కూడా విటమిన్ డి అవసరమే. సూర్య రశ్మి తగిలేట్లు శరీరాన్ని ఎండలో ఉంచితే అప్పుడు మన శరీరం చర్మం కింద విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అలాగే పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి తగినంతగా లభిస్తుంది. విటమిన్ డి లోపం ఉంటే డాక్టర్లు పరీక్షలు చేసి నిర్దారించి అందుకు అనుగుణంగా ట్యాబ్లెట్లను ఇస్తారు. ఆ ట్యాబ్లెట్లను వాడినా కూడా విటమిన్ డి లోపం నుంచి బయట పడవచ్చు. ఇక విటమిన్ డి మనకు చేపలు, కోడిగుడ్డు పచ్చ సొన, పాలు, తృణ ధాన్యాలు, నారింజ పండ్ల ద్వారా లభిస్తుంది.
విటమిన్ డి లోపిస్తే మన శరీరం పలు సంకేతాలను తెలియజేస్తుంది. తీవ్రమైన అలసట ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. చిన్న పనిచేసినా తీవ్రమైన అలసట వస్తుంది. ఎముకలు నొప్పిగా ఉంటాయి. కండరాలు బలహీనంగా మారిపోతాయి. నొప్పి వస్తుంది. చేతులు, తొడల్లో ఉండే కండరాలు నొప్పిగా ఉంటాయి. గాయాలు నెమ్మదిగా మానుతాయి. జుట్టు రాలిపోతుంది. చర్మం రంగు పాలిపోయినట్లు తెల్లగా అవుతుంది. కొందరికి నిద్రలేమి సమస్య వస్తుంది. నొప్పిని ఏమాత్రం భరించలేకపోతుంటారు. పాదాలు, అరచేతుల్లో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ విటమిన్ డి లోపించిందని తెలిపే సంకేతాలు.
Vitamin D
విటమిన్ డి లోపం వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. శరీరానికి సూర్య రశ్మి సరిగ్గా తగలకపోయినా, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు ఉన్నా, కిడ్నీ, లివర్ వ్యాధులు ఉన్నా, శస్త్ర చికిత్స అనంతరం పలు కారణాల వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. వయస్సు 65 ఏళ్లు పైబడిన వారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే డార్క్ కలర్ చర్మం ఉన్నవారిలో, అధిక బరువు ఉన్నవారిలో, పర్యావరణ కారణాల వల్ల కూడా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి లోపాన్ని పరిష్కరించకుండా ఎక్కువ కాలం పాటు అలాగే ఉంచితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. అలాగే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కనుక విటమిన్ డి లోపం ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.
విటమిన్ డి లోపం ఉందని నిర్దారించేందుకు గాను రక్త పరీక్షలు చేస్తారు. పరీక్షలో విటమిన్ డి తగినంత లేనట్లు వస్తే అప్పుడు విటమిన్ డి లోపం ఉందని గుర్తించి డాక్టర్లు మందులను ఇస్తారు. వాటిని రోజూ క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకుంటే త్వరగా ఈ లోపం నుంచి బయట పడవచ్చు. పెద్దలకు విటమిన్ డి రోజుకు 15 మైక్రోగ్రాములు లేదా 600 ఐయూ మోతాదులో అవసరం అవుతుంది. చిన్నారులకు ఇందులో సగం చాలు. విటమిన్ డి మనకు చేపలు, కోడిగుడ్డు పచ్చ సొన, లివర్, నారింజ పండ్లు, కాడ్ లివర్ ఆయిల్, చియా సీడ్స్, నువ్వులు, చీజ్ వంటి ఆహారాల ద్వారా కూడా లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే విటమిన్ డి లోపం నుంచి బయట పడవచ్చు.