Sleeplessness | నిద్ర అనేది మనషి శరీరానికి అత్యవసరం. సరైన మోతాదులో నీళ్లను తాగడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం కూడా అంతే అవసరం. నిద్రించడం వల్ల మెదడు పునరుత్తేజం చెందుతుంది. మెదడు కణాలు మరమ్మత్తులకు గురవుతాయి. రోజంతా మనం చేసే పనులను జ్ఞాపకాల రూపంలో మెదడు భద్రపరుచుకునేందుకు నిద్ర ఉపయోగపడుతుంది. మన జ్ఞానం, తెలివితేటలు, నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు మెదడుకు నిద్ర అవసరం అవుతుంది. నిద్ర వల్ల శరీరం కూడా తన భాగాలకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. ముఖ్యంగా కణజాలాలు మరమ్మత్తులకు గురవుతాయి. కండరాలు, కణాలు నిర్మాణమవుతాయి. నిద్ర వల్ల శరీరం వ్యర్థాలను సులభంగా బయటకు పంపిస్తుంది. హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇలా నిద్ర వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది.
అయితే రోజూ తగినన్ని గంటలపాటు కచ్చితంగా నిద్రించాల్సి ఉంటుంది. నిద్ర అనేది వ్యక్తిని, వయస్సును, వాతావరణ పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి రోజుకు ఎన్ని గంటలపాటు నిద్రించాలి అనే సమయం మారుతుంది. సాధారణంగా రోజుకు 6 నుంచి 8 గంటల పాటు అయినా సరే నిద్రించాలని వైద్యులు చెబుతుంటారు. అయితే సరిగ్గా నిద్రించకపోతే అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయి. మెదడు పనితీరు మందగిస్తుంది. చురుగ్గా ఉండలేకపోతారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. మతిమరుపు పెరుగుతుంది. ఏ విషయంపై ధ్యాస పెట్టలేకపోతుంటారు. ఆసక్తిగా అనిపించదు. ఎల్లప్పుడూ ఆందోళన, కంగారు, విసుగు ఉంటాయి. నిర్ణయాలను తీసుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. బద్దకంగా ఉంటారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. అతిగా ఆహారం తింటారు. దీంతో బరువు పెరుగుతారు.
దీర్ఘకాలంలో నిద్రలేమి సమస్య ఉంటే అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. జీవక్రియలు మందగిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్యం సన్నగిల్లుతుంది. శరీరం వ్యర్థాలను బయటకు పంపలేకపోతుంది. దీంతో శరీరం విషతుల్యంగా మారి రోగాలు వస్తాయి. కనుక ఇలా జరగకుండా ఉండాలంటే రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించాల్సి ఉంటుంది. అయితే నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం వంటి పనులు చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలను రాత్రి పూట తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఆ ఆహారాలను తీసుకుంటే నిద్రను ప్రోత్సహిస్తాయి. దీంతోపాటు పలు పోషకాలను కూడా అందిస్తాయి.
రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టాలంటే ట్రిప్టోఫాన్, మెలటోనిన్, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. ట్రిప్టోఫాన్ లభించాలంటే రాత్రి పూట పాలను తాగాలి. చికెన్, కోడిగుడ్లు, చీజ్, పల్లీలు, గుమ్మడికాయ విత్తనాలు, టోఫు వంటి ఆహారాలను తీసుకుంటే మెలటోనిన్ లభిస్తుంది. వాల్ నట్స్, పిస్తా కూడా మేలు చేస్తాయి. చెర్రీ పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే బాదంపప్పు, పాలకూర, అవకాడో, అరటి పండ్లను తింటుంటే మెగ్నిషియం లభిస్తుంది. ఇది కూడా నిద్రను ప్రోత్సహిస్తుంది. చిలగడదుంపలు, ఓట్ మీల్, బ్రౌన్ రైస్, కమోమిల్ టీ వంటి వాటిని తీసుకుంటున్నా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అయితే వీటిని రాత్రి నిద్రకు ఒక గంట ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇలా నిద్రలేమిని తగ్గించుకోవచ్చు. రోజూ తగినన్ని గంటలపాటు కచ్చితంగా నిద్రించవచ్చు.