Fasting | బరువు తగ్గడానికి, శరీర జీవక్రియను పెంచడానికి మనలో చాలా మంది ఉపవాసం చేస్తూ ఉంటారు. అలాగే కొందరు ఆధ్యాత్మిక భావనతో వారి మతాచారాలకు తగ్గట్టు ఉపవాసం చేస్తూ ఉంటారు. ఒక రోజంతా చేసే ఉపవాసం, డీటాక్స్ ఉపవాసాలు, దీర్ఘకాలిక ఉపవాసాలు ఇలా అనేక రకాల ఉపవాసాలు వాడుకలో ఉన్నాయని చెప్పవచ్చు. ఉపవాసాలు చేయడం వల్ల బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు కొంత వరకు తగ్గడం, జీవక్రియల వేగం పెరగడం వంటి లాభాలు ఉంటాయి. కానీ గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం ఉపవాసం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు, అరిథ్మియా వంటి సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయడం వల్ల వారిలో చక్కెర స్థాయిలు, ఎలక్ట్రోలైట్ సమతుల్యత, నీటి శాతం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉపవాసం చేయడం వల్ల వారు జీవించే లయకు ఆటంకం కలుగుతుంది. ఇవన్నీ గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు.
ఉపవాసం చేయడం మొదలు పెట్టినప్పుడు చురుకుగా బాగానే ఉన్న దీర్ఘకాలం పాటు ఉపవాసం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో తగ్గుతాయి. నీరసం, దడ, వణుకు, మూర్ఛ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గుతాయి. హృదయ స్పందనల్లో మార్పులు వస్తాయి. డీహైడ్రేషన్ కారణంగా రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇక బీటా బ్లాకర్స్, యాంటీ అరిథమిక్స్, బ్లడ్ థిన్నర్స్ వంటి మందులు వాడే వారు ఆహారంతో పాటు నిర్దిష్ట సమయంలో మందులను వేసుకోవాలి. ఉపవాసం చేస్తూ ఈ మందులు వేసుకోవడం వల్ల తలతిరగడం, లోబీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, హైబీపీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఎక్కువ సమయం ఉపవాసం చేయడం వల్ల పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి అరిథ్మియాను రేకెత్తిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఉపవాసం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచుతుంది. కనుక గుండె జబ్బులు ఉన్నవారు ఉపవాసం చేయకపోవడమే మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు ఒకవేళ ఉపవాసం చేయాల్సి వస్తే వైద్యుల సూచనలను పాటించాలి. అలాగే ఉపవాసానికి ముందు ఉపవాసం చేసిన తరువాత తగినంత నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండెపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. అలాగే వైద్యుడి సలహా మేరకు ఎంత సమయం వరకు ఉపవాసం చేయాలి అనే వివరాలను తెలుసుకోవాలి.
ఉపవాసం చేసిన తరువాత ఎలక్ట్రోలైట్ ల సమతుల్యానికి పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్ ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. అలాగే గుండె జబ్బులు ఉన్నవారు 12 గంటల కంటే ఎక్కువగా ఉపవాసం చేయకూడదు. ఉపవాసం ఎక్కువగా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గడంతో పాటు బీపీ కూడా తగ్గుతుంది. ఇక ఉపవాసం చేసే సమయంలో ఛాతీలో నొప్పి, తలతిరగడం, దడ, వణుకు, నీరసం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఉపవాసం మంచిదే అయినప్పటికీ గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మంచిది కాదు. గుండె జబ్బులతో బాధపడే వారు జాగ్రత్తగా, ప్రణాళికతో చేయడం మంచిది.