Testosterone | స్త్రీ ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు ఉపయోగపడితే పురుషుల ఆరోగ్యానికి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. టెస్టోస్టిరాన్ పురుషుల్లో వృషణాల్లో ఉత్పత్తి అవుతుంది. ఇది పురుషుల్లో అనేక రకాల విధులను నిర్వహిస్తుంది. టెస్టోస్టిరాన్ వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఉత్పత్తి అవుతుంది. శుక్ర కణాలు నాణ్యంగా ఉంటాయి. అంగ స్తంభన సమస్య తగ్గుతుంది. టెస్టోస్టిరాన్ వల్ల పురుషుల్లో కండరాల నిర్మాణం జరుగుతుంది. దేహం దృఢంగా మారుతుంది. పురుషుల్లో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. టెస్టోస్టిరాన్ వల్ల పురుషుల్లో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. దీని వల్ల దేహం దృఢంగా మారుతుంది. అలాగే శిరోజాల పెరుగుదలకు ఈ హార్మోన్ పనిచేస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, పురుషు శక్తి సామర్థ్యాలకు, మూడ్ సరిగ్గా ఉండేందుకు, గొంతు లేదా కంఠ స్వరానికి కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉపయోగపడుతుంది.
అయితే వృద్ధాప్యం వచ్చే వరకు పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు అధికంగానే ఉంటాయి. కనుక ఆ వయస్సులో కూడా పురుషులు సంతానం పొందే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. 40 నుంచి 50 ఏళ్ల వయస్సు దాటిన తరువాత క్రమంగా టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో పురుషులు శక్తిహీనంగా మారుతారు. అయితే కొందరు యుక్త వయస్సులో ఉన్నవారికి టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల వారు శృంగారంలో చురుగ్గా పాల్గొనలేకపోతుంటారు అలాగే శక్తి సామర్థ్యాలు సైతం తక్కువగా ఉంటాయి. సంతాన లోపం కూడా ఉంటుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉంటే పలు లక్షణాలు కనిపిస్తాయి. పురుషుడిలో ఒక డెసిలీటర్కు గాను 300 నానోగ్రాముల వరకు టెస్టోస్టిరాన్ ఉంటుంది. అంతకన్నా తక్కువగా ఉంటే టెస్టోస్టిరాన్ లోపం ఉన్నట్లు భావించాలి. దీంతో శరీరంలో పలు లక్షణాలను గమనించవచ్చు.
పురుషులు శృంగారం పట్ల ఆసక్తిగా లేరంటే టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు భావించాలి. అలాగే ఈ హార్మోన్ సరిగ్గా లేకపోతే అంగస్తంభనలు ఉండవు. వీర్యం చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. లేదా అసలు ఉత్పత్తి ఆగిపోతుంది. ఇక వీర్యం ఉత్పత్తి అయినా శుక్ర కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉన్న వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. స్త్రీలలో లాగా కొందరు పురుషులకు స్తనాలు పెరుగుతాయి. అలాంటి వారిలోనూ టెస్టోస్టిరాన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. ఈ హార్మోన్ తక్కువగా ఉంటే కొందరు పురుషులకు జననావయవాల దగ్గర టచ్ చేస్తే ఎలాంటి స్పందన ఉండదు. టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉన్న పురుషులు ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా తరచూ అలసటకు గురవుతుంటారు. తరచూ డిప్రెషన్‌తో బాధపడే పురుషుల్లోనూ ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్ తగ్గిన పురుషులు శక్తి లేనట్లు, నిస్సత్తువగా ఫీలవుతారు. కండరాలు బలహీనంగా మారుతాయి. ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకలు దృఢత్వాన్ని కోల్పోయి సులభంగా విరిగిపోతాయి. ఈ హార్మోన్ తక్కువగా ఉండే పురుషులు తరచూ చిరాకు పడుతుంటారు.
టెస్టోస్టిరాన్ లోపం ఉంటే సాధారణంగా వైద్యులు మందులను ఇస్తారు. దీంతో ఈ సమస్య సులభంగా తగ్గిపోతుంది. అలాగే రోజూ వ్యాయామం చేయడం, వేళకు నిద్రించడం, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం, మద్యపానం, ధూమపానం మానేయడం వంటివి అలవాటు చేసుకుంటే టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఇక ఈ హార్మోన్ స్థాయిలను పెంచేందుకు గాను పలు ఆహారాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. జింక్ అధికంగా ఉండే బాదంపప్పు, జీడిపప్పు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలను ఆహారంలో భాగం చేసుకుంటే టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుకోవచ్చు. అలాగే విటమిన్ డి ఉండే చేపలు, పాలు, కోడిగుడ్లను తింటుండాలి. మెగ్నిషియం ఉండే పాలకూరను తింటున్నా మేలు జరుగుతుంది. పప్పు దినుసులు, ఆలివ్ ఆయిల్, అవకాడో, దానిమ్మ పండ్లు, బ్రోకలీ, కాలిఫ్లవర్ వంటి ఆహారాలను తీసుకుంటున్నా ఉపయోగం ఉంటుంది. ఇలా పురుషులు తమ టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.