Vitamin C | మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అందరికీ తెలుసు. అయితే కేవలం ఇదే కాదు, ఇంకా అనేక రకాల పనులకు కూడా మనకు విటమిన్ సి అవసరం అవుతుంది. విటమిన్ సి మనకు అనేక ఆహారాల్లో లభిస్తుంది. ఇది కణజాలాలకు మరమ్మత్తులు చేస్తుంది. కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారేలా చేస్తుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా విటమిన్ సి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగం పడుతుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. కనుక శరీరం ఈ విటమిన్‌ను నిల్వ ఉంచుకోలేదు. కాబట్టి ఈ విటమిన్‌ను మనం రోజూ తప్పనిసరిగా శరీరానికి అందించాల్సి ఉంటుంది.
విటమిన్ సి లోపం ఉంటే మన శరీరం మనకు పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. సాధారణంగా విటమిన్ సి ని మనం రోజూ మనుకు తెలియకుండానే తీసుకుంటాం. ఇది అనేక ఆహారాల్లో ఉంటుంది. కనుక విటమిన్ సి లోపం రాదు. కానీ కొందరు రోజూ ఒకేలాంటి ఆహారం తింటారు. అలాంటి వారితోపాటు మహిళల్లో విటమిన్ సి లోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ లోపం ఉంటే తీవ్రమైన నీరసం, అలసట ఉంటాయి. శరీర మానసిక స్థితిలో సైతం మార్పులు వస్తాయి. బరువు తగ్గుతారు. కీళ్లు, కండరాల నొప్పులు ఉంటాయి. సులభంగా గాయాలు అవుతుంటాయి. పుండ్లు త్వరగా మానవు. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. జుట్టు చివర్లు చిట్లిపోతాయి. చర్మం పొడిబారి కాంతిహీనంగా కనిపిస్తుంది. ఇలా విటమిన్ సి లోపం ఉన్నవారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకుంటే హైబీపీ తగ్గుతుంది. మూత్ర విసర్జన సాఫీగా అవుతుంది. మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త నాళాల గోడలపై పడే ఒత్తిడి తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మన శరీరం మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను సరిగ్గా శోషించుకోవాలంటే అందుకు విటమిన్ సి అవసరం అవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే విటమిన్ సి అవసరం అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ విటమిన్ సి పనిచేస్తుంది. ఇక విటమిన్ సి మనకు వయస్సును బట్టి నిర్దిష్టమైన మోతాదులో రోజూ అవసరం అవుతుంది. సాధారణంగా విటమిన్ సి 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారికి అయితే రోజుకు 40 నుంచి 60 మిల్లీగ్రాములు అవసరం అవుతుంది. అదే 18 ఏళ్లకు పైబడిన వారికి అయితే రోజుకు 90 మిల్లీగ్రాములు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు 120 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం అవుతుంది.
విటమిన్ సి మనకు అనేక ఆహారాల్లో లభిస్తుంది. ఇది మనం రోజూ తినే కూరగాయలు, ఆకుకూరల్లో అధికంగా ఉంటుంది. అలాగే సిట్రస్ జాతికి చెందిన పండ్లను కూడా తినవచ్చు. నారింజ పండ్లు, నిమ్మ, ఉసిరి, గ్రేప్ ఫ్రూట్, ద్రాక్ష, కివి పండ్లు, క్యాప్సికం, టమాటా, వెల్లుల్లి, పైనాపిల్, బొప్పాయి, పచ్చి బఠానీలు, అరటి పండ్లు, యాపిల్, కొత్తిమీర, పుదీనా, క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవర్ వంటి పండ్లు, కూరగాయలను అధికంగా తింటుంటే విటమిన్ సి ని పొందవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.